మిల్లింగ్ మీరే చేసుకోండి!

13-11-2026 | 05:35am
  1. సర్కారుకు భువనగిరి మిల్లర్ల ఓపెన్ ఆఫర్
  2. మిల్లులను లీజుకు ఇచ్చేందుకు సిద్ధమంటూ ప్రకటన
  3. ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో నిర్వహించుకోవచ్చని ప్రతిపాదన
  4. సమస్య పరిష్కారం కాకుంటే మిల్లింగ్‌కు ఆటంకమే!

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ధాన్యం మిల్లింగ్ చేయడం మీకు కష్టంగా అనిపిస్తోందా? అయితే మా మిల్లులను లీజుకు తీసుకోండి.. మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆధ్వర్యంలో మీరే మిల్లింగ్ చేయించుకోండి.. ప్రభుత్వం నిర్దేశించిన దిగుబడి ప్రమాణాలు సాధ్యమో కాదో ప్రత్యక్షంగా తేల్చుకోండి.. అంటూ భువనగిరి జిల్లా రైస్ మిల్లర్లు(Bhuvanagiri Millers) ప్రభుత్వానికి బహిరంగ ఆఫర్ ఇచ్చారు.

క్వింటాల్ ధాన్యానికి 67 శాతం రా రైస్, 68 శాతం (ఔట్ బర్న్ రేషియో బాయిల్డ్ రైస్ ఇవ్వాలన్న నిబంధనపై ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరదించేందుకు సిద్ధమని ప్రకటించారు. మిల్లింగ్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటికే పాత ధాన్యం నిల్వలు, సీఎంఆర్ బియ్యం అప్పగింతలు, కొత్త ధాన్యం కేటాయింపులపై ప్రభుత్వంతో వివాదం నడుస్తుండగా.. తాజాగా మిల్లులను లీజుకు ఇచ్చేందుకు సిద్ధమంటూ మిల్లర్లు చేసిన ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది.  

ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన మిల్లర్లు

గత సీజన్లలో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మిల్లుల్లో పేరుకుపోయిందని, పాత ధాన్యాన్ని పూర్తిస్థాయిలో మిల్లింగ్ చేసి బియ్యాన్ని అప్పగించకముందే కొత్తగా ధాన్యం కేటాయిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భువనగిరి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ వాదిస్తోంది. లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉండగా.. కొత్తగా వానాకాలం, యాసంగి సీజన్లకు మళ్లీ కేటాయింపులు చేయడం తమపై అదనపు ఒత్తిడికి దారితీస్తోందని పేర్కొంటూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. పాత ధాన్యం మిల్లింగ్ పూర్తయ్యే వరకు కొత్తగా కేటాయింపులు చేయవద్దని పిటిషన్‌లో కోరింది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు భువనగిరి జిల్లాలోని మిల్లులకు ధాన్యం కేటాయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిల్లర్లకు కొంత ఊరట లభించినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్ బకాయిలు, ధాన్యం కేటాయింపుల సమస్య మాత్రం కొనసాగుతోంది. విజిలెన్స్, సీఐడీ, టాస్క్‌ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ డిఫాల్ట్ మిల్లర్లపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భువనగిరి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఈ వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి ధాన్యం కేటాయించవద్దని హైకోర్టును ఆశ్రయించి సానుకూల ఫలితం సాధించారు. 

ఎస్‌హెచ్‌జీలకు అప్పగిస్తారా?

ఈ నేపథ్యంలోనే భువనగిరి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ మరో అడుగు ముందుకేసి ప్రభుత్వానికి బహిరంగ ప్రతిపాదన చేసింది. తమ సంఘంలోని కొందరు మిల్లర్లు మిల్లులను సాధారణ అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. ప్రభుత్వం వాటిని తీసుకుని మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మిల్లింగ్ నిర్వహించుకోవచ్చని పేర్కొంది. తద్వారా ప్రభుత్వం నిర్దేశించిన 67, 68 శాతం దిగుబడి ప్రమాణాలు ఎంతవరకు సాధ్యమో స్వయంగా పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరింది. ప్రభుత్వానికి సహకరించకూడదన్నది తమ ఉద్దేశం కాదని, మిల్లర్లు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి న్యాయమైన పరిష్కారం చూపాలన్నదే తమ అభ్యర్థన అని సంఘం తమ పేర్కొంది.   

మొదటి నుంచి ‘ఓటీఆర్’ వివాదం

ప్రభుత్వం, మిల్లర్ల మధ్య ప్రధాన వివాదంగా మారిన అంశం ఔట్‌టర్న్ రేషియో (ఓటీఆర్). అంటే ఒక క్వింటా ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే ఎంత బియ్యం వస్తుందన్నదే ఈ లెక్క. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రా రైస్‌కు 67 శాతం, బాయిల్డ్ రైస్‌కు 68 శాతం దిగుబడి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ధాన్యం నాణ్యత, తేమశాతం, మిల్లింగ్ సమయంలో వచ్చే నూకలు, ఇతర నష్టాల కారణంగా నిర్దేశిత దిగుబడి సాధించడం కష్టమని మిల్లర్లు వాదిస్తున్నారు.

ఈ అంశంపై గతంలోనూ పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన టెస్ట్ మిల్లింగ్‌లో క్వింటాలు ధాన్యానికి 55 కిలోల వరకే బియ్యం వచ్చిందని మిల్లర్లు చెబుతున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఎక్కడా దీనిని నిర్ధారించడం లేదు. అందుకు సంబంధించిన నివేదిక కూడా బహిరంగ పర్చలేదు. దీంతో వాస్తవ దిగుబడి ఎంత? ప్రభుత్వం నిర్దేశిస్తున్న ప్రమాణాలు క్షేత్రస్థాయిలో సాధ్యమేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి.

మిల్లింగ్ సాధ్యమా?

ఓటీఆర్‌పై స్పష్టత తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బహిరంగంగా ప్రభుత్వానికి ఇచ్చిన ఆఫర్‌తో మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే.. ఇతర జిల్లాల రైస్ మిల్లర్లు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించి తమకు అనుకూలమైన ఆదేశాలను తెచ్చుకునే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ప్రస్తుత వానాకాలం, యాసంగి సీజన్ల ధాన్యం మిల్లింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఇదే జరిగితే.. భువనగిరి జిల్లా రైస్ మిల్లర్ల తరహాలో ఇతర జిల్లాల మిల్లర్లు కూడా ప్రభుత్వానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చే చాన్స్ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భువనగిరి జిల్లా మిల్లర్ల ఓపెన్ ఆఫర్‌ను, ఓటీఆర్‌పై సవాల్‌ను ప్రభుత్వం సీకరించి.. ఎస్‌హెచ్‌జీలకు మిల్లింగ్ బాధ్యతలు అప్పగిస్తుందా.. లేక మిల్లర్ల సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు