కార్తిక పౌర్ణమి వేళ.. పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ
హైదరాబాద్: కార్తిక పౌర్ణమి(Karthika Purnima) పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కొండగట్టులో అంజన్న దర్శనానికి భక్తుల క్యూ
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయస్వామి ఆలయం(Kondagattu Anjaneya Swamy Temple)లో భక్తుల సందడి నెలకొంది. కార్తిక మాసం, స్వామివారి నిజరూప దర్శనం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గిరిప్రదక్షిణ నిర్వహించిన అనంతరం అంజన్నను దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో సందడిగా మారాయి.
బాసరలో దీపోత్సవానికి ఏర్పాట్లు
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం(Basara Gnana Saraswati Ammavari Temple)లో కార్తిక పౌర్ణమి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం అమ్మవారిని పల్లకిలో గోదావరి నదీ తీరానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పవిత్ర నదీ తీరంలో దీపోత్సవం జరగనుంది. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
యాదాద్రిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం(Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple)లోనూ కార్తిక పౌర్ణమి వేడుకలు(Karthika Pournami Celebrations) వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాల(Satyanarayana Swamy Vratham)ను ఆచరిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బ్యాచ్‌ల వారీగా వ్రతాలు నిర్వహిస్తున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొత్తంగా కార్తిక పౌర్ణమి వేళ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తుల నామస్మరణలు, దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.