శీతాకాలపు సిరి.. సీతాఫలం!

25-10-2026 | 05:15am

ఎలాంటి రసాయనాలు లేవు. ఎరువులు, విత్తనాలు జాడే లేదు. చెట్లను సంరక్షించేది లేదు. వరుణుడి కరుణతో మట్టి కొండలు, రాళ్ల గుట్టల మధ్య సహజసిద్ధంగా పండే ప్రకృతి వరప్రసాదం ‘సీతాఫలం’. మారుతున్న కాలం.. పచ్చదనాన్ని మింగేస్తున్న అభివృద్ధి..  ఎండల తీవ్రత, వాతావరణ మార్పు ల ప్రభావంతో ఆ సంపద కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పల్లెవాసుల పెదవులపై చిరునవ్వులు పూయించిన ఆ ‘పేదల యాపిల్’ నేడు తగ్గుతున్న దిగుబడితో అరుదైన పండు గా మారుతోంది.

* ఒకప్పుడు సహజంగా దొరికిన ఈ ఫలం.. పట్టణ మార్కెట్లలో అధిక ధర పలుకుతోంది. ప్రకృతి మార్పు లు, తగ్గుతున్న చెట్ల సంఖ్య మధ్య సీతాఫలం తన ఉనికిని కోల్పోతోంది. పల్లె జ్ఞాపకాలకు ప్రతీకగా నిలిచిన ఈ అమృత ఫలం.. పేదలకు ఉపాధినిచ్చే వనరుగా కొనసాగాలంటే సహజ చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  1. శీతాకాలపు సిరి.. సీతాఫలం!
  2. విత్తు నాట్టేది లేదు.. నీరు పెట్టేది లేదు..
  3. ప్రకృతి ఆధారిత మొక్క.. పేదల యాపిల్
  4. అభివృద్ధి మాటున తరిగిపోతున్న చింతపలక్కాయలు

వెలవెలబోతున్న గుట్టలు

ఒకప్పుడు ఈత, తాటి చెట్లతోపాటు ఊరి ముంగిట గుట్టలు, చెరువుల గట్లు, వాగులువంకలు, రోడ్ల పక్కన సీతాఫలం చెట్లు విరివిగా కనిపించేవి. వ్యవసాయ పనుల(Agricultural activities) మధ్యలో సైకిళ్లపై వెళ్లి చెట్లెక్కి కోసుకొచ్చిన దోరకాయలను ఇంట్లో ధాన్యం మధ్యనో, గడ్డిలోనో పెట్టి మగ్గబెట్టేవారు. ఆ తర్వాత తియ్యని పండ్లను కుటుంబమంతా కలిసి ఆరగించేవారు. ఆ మధురమైన రోజులు నేడు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. సహజ చెట్లు తగ్గడంతో గుట్టలు, పొలాల గట్లపై నాటి పచ్చదనం, సీతాఫలాల సువాసనే లేకుండా పోయింది. 

ఎండల ప్రభావం.. తగ్గుతున్న దిగుబడులు 

సీతాఫలం దిగుబడిపై వర్షపాతం, ఉష్ణోగ్రతలు, నేలలో తేమ ప్రభావం చూపుతాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఎండల తీవ్రత పెరగడం, నీటి ఎద్దడి వంటి పరిస్థితులు పూత, పిందె దశల్లో చెట్ల పెరుగుదలను దెబ్బతీస్తున్నాయి. దీంతో పూత వాడిపోవడం, పిందెలు రాలిపోవడం, కాయల సంఖ్య తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతోపాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో సీతాఫలం సేకరణపై ఆధారపడేవారు ఉన్నారు. దిగుబడులు తగ్గినప్పుడు పండ్ల లభ్యతతోపాటు రహదారుల వెంట విక్రయించే వారి సందడీ తగ్గుతోంది.

పేదల ఉపాధికి గండి.. ధరల భారం 

సీతాఫలం కేవలం ఓ పండు మాత్రమే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, గిరిజన కుటుంబాలకు సీజనల్ ఉపాధి వనరు. వ్యవసాయ పనులు లేని సమయంలో గుట్టలు, అడవుల వెంట తిరిగి పండ్లను సేకరించి విక్రయిస్తుంటారు. వచ్చిన ఆదాయంతో కుటుంబ అవసరాలు తీర్చుకుంటారు. దిగుబడి తగ్గి పండ్లు దొరకని పరిస్థితుల్లో వారి ఉపాధికీ గండి పడుతోంది. మరోవైపు మార్కెట్లో సరఫరా తగ్గితే ధరలు పెరిగే అవకాశం ఉంది.

ప్రాంతం, పండ్ల పరిమాణం, నాణ్యతను బట్టి ఒక్కో సీతాఫలం రూ.20 నుంచి రూ.30 వరకు, బుట్ట రూ.400 నుంచి రూ.600 లేదా అంతకంటే ఎక్కువ ధర పలకవచ్చు. దీంతో సామాన్యులు కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఒకప్పుడు ప్రకృతి సహజంగా అందించిన పండు.. నేడు పేదలకు ఉపాధి సమస్యగా, వినియోగదారులకు ధరల భారంగా మారుతోంది.

తోటల సాగుపై ఆసక్తి.. సహజ చెట్లకు రక్షణ ఏదీ?

సహజంగా లభించే సీతాఫలం తగ్గుతుండటంతో కొందరు రైతులు తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. సరైన పద్ధతుల్లో సాగు చేస్తే ఇది ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. అయితే తోటల పెంపకంతోపాటు గుట్టలు, పొలాల గట్లు, అడవి ప్రాంతాల్లో సహజంగా పెరిగే చెట్లను కాపాడుకోవడమూ అంతే ముఖ్యం. కొత్త మొక్కలు నాటి పెంచేందుకు ప్రోత్సహించాలి. పండ్లను త్వరగా మగ్గించేందుకు అనుమతి లేని రసాయనాలు ఉపయోగించకుండా పర్యవేక్షణ ఉండాలి. సహజంగా పండిన పండ్లకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు సాగుపై అవగాహన కల్పించడంతోపాటు సేకరణదారులకు సరైన మార్కెట్ సదుపాయాలు కల్పించాలి.

ప్రకృతి వరాన్ని భావితరాలకు అందిద్దాం

సీతాఫలం వెనుక పల్లె జ్ఞాపకాలు ఉన్నాయి.. పేదల జీవనంలో ఉపాధి ఉంది.. ప్రకృతి ఒడిలో పచ్చదనం ఉంది. ఈ మూడింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సహజ చెట్ల నరికివేతను అరికట్టడం, గుట్టలు, అడవులను సంరక్షించడం, కొత్త మొక్కలు నాటడం, రైతులను తోటల సాగువైపు ప్రోత్సహించడం అవసరం. నాటి తరాలకు తీపి జ్ఞాపకంగా నిలిచిన సీతాఫలం.. రేపటి తరాలకు కేవలం కథగా మిగిలిపోకూడదు. ప్రకృతి ప్రసాదించిన ఈ అమృత ఫలాన్ని కాపాడుకుంటేనే ఆ తీపి రుచి, పల్లె జ్ఞాపకాలు, పేదల ఉపాధి భావితరాలకూ కొనసాగుతాయి.

 గడగోజు రవీంద్రచారి, జర్నలిస్టు, 9848772232. 

మరిన్ని వార్తలు