డీఏపై ప్రభుత్వం కీలక ప్రకటన

01-10-2026 | 06:22pm

సిక్కిం: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సిక్కిం ప్రభుత్వం తీపికబురు అందించింది. కరువు భత్యం (DA), కరువు ఉపశమన భత్యం (DR) రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ గురువారం సర్క్యులర్ విడుదల చేసింది. సవరించిన భత్యాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 50 వేల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.

కొత్త ఉత్తర్వుల ప్రకారం.. సవరించని పాత మూల వేతన విధానంలో జీతాలు, పెన్షన్లు పొందుతున్న వారికి DA, DR రేట్లు 257 శాతం నుంచి 262 శాతానికి పెరిగాయి. అదే విధంగా సవరించిన మూల వేతన విధానంలో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ రేట్లు 58 శాతం నుంచి 60 శాతానికి చేరాయి. దీంతో వేర్వేరు పే స్కేల్‌లలో వేతనాలు పొందుతున్న వారికి వారి విధానాన్ని బట్టి పెరిగిన భత్యాలు అందనున్నాయి.

కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వర్తింపు.. AIS అధికారులకు ప్రత్యేక ఉత్తర్వులు

రాష్ట్ర ప్రభుత్వ సాధారణ వేతన శ్రేణుల ప్రకారం సవరించిన జీతాలు పొందుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు వర్క్‌ఛార్జ్డ్ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కూడా ఈ పెంపు వర్తించనుంది. ఆల్ ఇండియా సర్వీస్ (AIS) అధికారులకు సంబంధించిన డీఏను సైతం ప్రభుత్వం సవరించింది. ఆరో కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా పాత పే బ్యాండ్, గ్రేడ్ పే విధానంలో వేతనాలు పొందుతున్న అధికారులకు డీఏ 257 శాతం నుంచి 262 శాతానికి పెరిగింది. ఏడో వేతన సంఘం ఆధారంగా సవరించిన మూల వేతన విధానంలో ఉన్న అధికారులకు 58 శాతం నుంచి 60 శాతానికి పెంచారు.

రౌండింగ్ విధానంపై స్పష్టత

పెరిగిన భత్యాల చెల్లింపుల్లో లెక్కింపు విధానాన్ని కూడా ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. లెక్కించిన మొత్తంలో 50 పైసలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తదుపరి రూపాయికి పెంచి చెల్లించనున్నారు. 50 పైసల కంటే తక్కువ ఉన్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోరు. మొత్తంగా డీఏ, డీఆర్ పెంపుతో సిక్కిం ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది.

మరిన్ని వార్తలు