ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచాలి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో(government schools) విద్యార్థులు, ఉపాధ్యాయుల(teacher ) హాజరు శాతం పెంచాలని కలెక్టర్ కె.హరిత(Asifabad Collector Haritha) ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో సచ్చిదానంద చారితో కలిసి ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు.
సమగ్ర శిక్ష అభియాన్(Samagra Shiksha Abhiyan)లో జిల్లా ర్యాంకు తక్కువగా ఉందని, హాజరు శాతం కూడా ఆశించిన స్థాయిలో లేదని కలెక్టర్ తెలిపారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పాఠశాలలను తరచుగా సందర్శించి, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన అందించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సమన్వయకర్తలు శ్రీనివాస్, అబిద్ అలీ, అధికారులు పాల్గొన్నారు.