వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): వయోవృద్ధుల సంక్షేమం(Welfare of the Elderly), హక్కుల అమలుకు(Enforcement of rights) ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధులు భావితరాలకు ఒక దిక్సూచి లాంటివారని, వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు, కుటుంబాన్ని నిలబెట్టిన తీరు నేటి తరం పాటించాలని తెలిపారు. వృద్ధులను గౌరవించడం మన సంస్కృతి అని, వారి అనుభవాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధురాలు మహిళా సంఘాలలో సభ్యులుగా చేరితే ఎంతో భరోసా కలుగుతుందని, వ్యక్తిగత సమస్యలు గ్రూపు సభ్యులతో చర్చించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఎల్డర్ లైన్ టోల్ ఫ్రీ నం. 14567 కు కాల్ చేసి వివరించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా భక్తి గీతాలు ఆలపించిన రాజేశ్వరి, భూదేవి లను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు డిపిఎం లు, ఎపిఎం లు, సెర్ప్ సిబ్బంది, వయోవృద్ధులు పాల్గొన్నారు.