పండుగ పూట వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు
మిషన్ భగీరథ కార్మికుల ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మిషన్ భగీరథ(Mission Bhagiratha)లో పనిచేస్తున్న కార్మికులకు గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్(AITUC District General Secretary Boge Upender) డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి, డిఆర్ఓ దాసరి వేణుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. మాణిక్గూడ వాటర్ ప్లాంట్లో రాఘవ ఏజెన్సీ సబ్ ఎవరెస్ట్ ద్వారా పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు.
పలుమార్లు వేతనాల కోసం విజ్ఞప్తి చేసినా ఏజెన్సీ యాజమాన్యం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. వేతనాలు అందక పండుగ పూట కార్మిక కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు. వేతనాలు వెంటనే చెల్లించడంతో పాటు, బాధ్యులైన మిషన్ భగీరథ అధికారులు, ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్, కార్మికులు తిరుపతి, శ్రీకాంత్, రాజేశ్వర్, సుధాకర్, జయకృష్ణ, వేణు తదితరులు పాల్గొన్నారు.