ప్రీ-ప్రైమరీ పాఠశాలల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మాట్
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో సుందరీకరణ, పెయింటింగ్ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆసిఫాబాద్ మండలం బుర్గుడ, రెబ్బెన మండలం తల్లాలపల్లి గ్రామాల్లోని పూర్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, పాఠశాల ఆవరణలో చేపడుతున్న సుందరీకరణ, రంగుల పనులను పరిశీలించారు.
చిన్నారులకు ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన వాతావరణంలో విద్య అందేలా పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం పాఠశాల చిన్నారులతో అదనపు కలెక్టర్ ఆప్యాయంగా ముచ్చటించారు. వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఉత్సాహపరిచారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు చిన్నారుల ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.