కరీంనగర్ డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
- రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
- జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, అక్టోబరు 23 (విజయక్రాంతి): విద్యార్థులు(Students), యువత భవిష్యత్తును మత్తు పదార్థాలు(Intoxicating substances) ఛిద్రం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా(District Collector Chitra Mishra) స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్(District-Level Narcotic Control), జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాను(Karimnagar District) డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, నిరంతర నిఘా, విస్తృత తనిఖీలు, అవగాహన కార్యక్రమాలతో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, వినియోగంపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. డ్రగ్స్‌కు అలవాటుపడితే ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ఆలోచనా శక్తి క్షీణించి, వ్యక్తిగత జీవితం, కుటుంబం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తు పదార్థాల ఆకర్షణకు లోనుకాకుండా విద్యాసంస్థల స్థాయి నుంచే నిరంతర అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి మాదకద్రవ్యాల దుష్పరిణామాలను వివరించాలన్నారు.
డ్రగ్స్ రహిత కరీంనగర్ లక్ష్యాన్ని సాధించేందుకు పోలీసు, ఎక్సైజ్, విద్యా, వైద్య ఆరోగ్యశాఖలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేసి, మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
- రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి…
రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయని, విలువైన ప్రాణాలను కాపాడేందుకు రహదారి భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు రహదారులపై తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అవసరమైన మరమ్మతులు, భద్రతా చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. వాహనదారులు సైతం నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని హితవు పలికారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, డీఆర్వో స్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.