అమర్ హై.. షోయబుల్లా ఖాన్..
* జర్నలిజం అనే ఆయుధంతో నిజాం, రజాకార్ల దమనకాండపై పోరాటం.
• పాలేరు నియోజకవర్గంలో ఘన నివాళి.
• విమోచన దిన వారోత్సవాల్లో షోయబుల్లా ఖాన్ త్యాగస్ఫూర్తిని స్మరించిన భాజపా నాయకులు
తిరుమలాయపాలెం, సెప్టెంబరు 16 (విజయక్రాంతి): నిజాం పాలన, ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల దమనకాండకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జర్నలిజాన్ని ఆయుధంగా మలుచుకుని పోరాడి ప్రాణత్యాగం చేసిన ప్రముఖ పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్(Shoaibullah Khan) త్యాగాలను స్మరించుకుంటూ బీజేపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ విమోచన దిన వారోత్సవాల్లో భాగంగా సుబ్లేడ్ గ్రామంలో ఈ సందర్భంగా షోయబుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ ‘అమర్ హై’ అంటూ నినదించారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను నేటితరానికి తెలియజేయడంతో పాటు, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుల త్యాగాలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.
ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి బలిదానం చేసిన ఆయనను స్ఫూర్తిదాయక పాత్రికేయుడిగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లా భాజపా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, భాజపా కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, రవికుమార్ నున్న, రాష్ట్ర నాయకుడు రుద్ర ప్రదీప్, శామ్ రాథోడ్, తక్కెళ్లపల్లి నరేంద్రరావు, పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేకా సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.