గ్లోబల్స్ స్కూల్ లో పూల పండగ
- కూసుమంచి గ్లోబల్ రెయిన్ బోలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
- ఉట్టి పడిన సంస్కృతీ సంప్రదాయాలు
- బతుకమ్మలతో ఆడిపాడిన చిన్నారులు
- ముఖ్య అతిథిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ
కూసుమంచి, విజయక్రాంతి: గునుగు, తంగేడుల మేళవింపు .. కట్ల, చామంతుల వర్ణరంజితం , తీరొక్క పూలతో బతుకమ్మ.. చప్పట్లు కొడుతూ చెమ్మక్కలాడగా, గ్లోబల్ రెయిన్బో స్కూల్(Global Rainbow School) మురిసింది పూల జాతరగా.. తీరొక్క పూలన్నీ ఒక్కటయ్యే వేళ.. చిన్నారులంతా పరవశించే వేళ.. తంగేడు పూల పసుపు పచ్చని కాంతులతో, గునుగు పూల గుత్తుల అందాలతో, మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల(Telangana cultural traditions) ప్రతిరూపమైన బతుకమ్మ సంబురాలకు పాఠశాల ప్రాంగణం వేదికైంది. కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్ రెయిన్ , జేవీఆర్ కళాశాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) అంబరాన్నంటాయి.
ఉపాధ్యాయులు చిన్నారులతో కలిసి బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలతో పాఠశాల మోరుమోగింది. వేడుకలను యూనివర్సిటీ లా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని కోరారు. బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, ప్రకృతి, చెరువులు, మట్టిని ఆరాధించే గొప్ప తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని అన్నారు.
తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర తీరొక్క పూలతో గౌరమ్మను కొలుస్తూ తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ వేడుక గ్రామీణ జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. జీవనాధారమైన చెరువులను కాపాడుకుంటూ వాటికి కృతజ్ఞతగా పూలతో బతుకమ్మను తయారు చేసి నిమజ్జనం చేసే సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోందన్నారు. 'బతుకు అమ్మ' గా గౌరమ్మను పూజించే బతుకమ్మ పండుగ మహిళలు, చిన్నారుల్లో ఐక్యత, ఆనందం, అనుబంధాలను పెంపొందిస్తుందని తెలిపారు.
అందరు దేవుళ్లను పూలతో పూజించడం మనం చూస్తాం.. మన తెలంగాణలో మాత్రం పూలనే బతుకమ్మగా పూజించడం మన సంస్కృతిలో ఉన్న విశిష్ట సంప్రదాయమన్నారు.మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడం కోసం గ్లోబల్ రెయిన్ స్కూల్ యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయ మన్నారు. ఎస్సై దివ్య మాట్లాడుతూ క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. మహిళల భద్రత విద్యార్థుల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
పాఠశాల కరస్పాండెంట్ ఎండీ ఎర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ అందమైన రంగురంగల పూలతో ప్రకృతిలో మమేకమై పేర్చే పూల పండగ బతుకమ్మ అని, దీనిని పండగల మాత్రమే కాకుండా శాస్త్రీయ పరంగా కూడా పూలలో దాగి ఉన్న ఔషధ గుణాలు అన్ని నీటిలోని కాలుష్యాన్ని తొలగించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయన్నారు. విద్యార్థులకు మన సంప్రదాయాలు, బతుకమ్మ పాటలు, సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేసేందుకు బతుకమ్మ పండగ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ప్రసేన్, మంత్రి ప్రగడ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు.
బతుకమ్మలతో పాఠశాల కళకళలాడింది. పూలసింగిడిని తలపించింది. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలతో అలరించారు. తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదో చూపరులకు ప్రస్ఫుటం చేసింది. ‘చిత్తూ చిత్తూల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మా.. ఈ వాడలోనా’..! ‘ఏమేమి పువ్వుప్పునే గౌరమ్మా.. ఏమేమి కాయోప్పునే గౌరమ్మా..! తంగేడు పువ్వొప్పునే గౌరమ్మా.. తంగేడి కాయోప్పుడే గౌరమ్మా’..పాటలకు చిన్నారులకు బతుకమ్మలతో ఆడిపాడారు.
చిన్నారుల నృత్యాలు ఊర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, ఉపాధ్యక్షుడు దువ్వ సాగర్, జర్నలిస్టు జానీ, ఇన్ చార్జిలు జహ్నవి, పాపారావు, నాజియా అకడమిక్ ఇన్ చార్జి మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.