దమ్మపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
దమ్మపేట, అక్టోబర్ 10(విజయ క్రాంతి): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju) ఐపీఎస్ దమ్మపేట పోలీస్ స్టేషన్ ను శనివారం నాడు ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి,అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా వారి పనితీరు గురించి పరిశీలించారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థ పోలీసింగ్ వెబ్ అప్లికేషన్లపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని పలు సూచనలు చేశారు. స్టేషన్ పరిధిలోని క్రైమ్ ప్రాపర్టీని పరిశీలించి వాటి భద్రత, నిర్వాహణ పై అధికారులకు పలు సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్ 112 కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.