సైనికుల్లా పనిచేయండి.. ఎన్నికల్లో సత్తా చాటండి
10-10-2026 | 05:49pm
ఖమ్మం, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ఖమ్మం పట్టణంలోని ఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలంటే పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని భట్టి విక్రమార్క అన్నారు. జిల్లా స్థాయి సమావేశం అనంతరం ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, గ్రామస్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సీనియర్ నాయకుడిని ఇన్‌ఛార్జిగా (In-charge) నియమించి, వారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం ప్రస్తుత ఎన్నికల ప్రక్రియకు అనుగుణంగా మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, కోరెం కనకయ్య ప్రసంగించారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ అధ్యక్షత వహించారు.