రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి
ఏసీపీ వాసంశెట్టి మాధవి
హుజురాబాద్,అక్టోబర్27: (విజయక్రాంతి): రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి(Huzurabad ACP Vasamsetti Madhavi) అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం హుజురాబాద్ పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అందుకు పోలీసులు అహర్నిశలు చేస్తున్న కృషి, సేవలే కారణమని మున్సిపల్ చైర్పర్సన్ పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని కొనియాడారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐలు కరుణాకర్, శ్రీనివాస్, రామకృష్ణ, వెంకట్, ఎస్సైలు రవి, కృష్ణారావు, శేఖర్‌రెడ్డి, తిరుపతి, క్రాంతి, స్వాతి, వైద్యులు శ్రీకాంత్‌రెడ్డి, సుజాత, కౌన్సిలర్లు, సర్పంచులు, బీజేపీ నాయకులు, పట్టణ యువకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.