ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, నవంబరు 17 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipalli Satyam) అన్నారు. మంగళవారం గంగాధర మండలం మధురానగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే తో ఎమ్మెల్యే గంగాధర మండలంలోని 33 గ్రామాలకు చెందిన 897 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగాధర మండలంలో 389 వితంతు, 26 వికలాంగుల, 101 గీత కార్మిక, 75 ఒంటరి మహిళ, 126 చేనేత పెన్షన్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్ అందజేయడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు ఉచిత సన్నబియ్యం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రామ్, మండల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.