తెలంగాణకు గుడ్ న్యూస్

17-11-2026 | 04:26pm

హైదరాబాద్: తెలంగాణలో గోదావరి జలాల వినియోగానికి కీలకమైన సమ్మక్క సాగర్ బ్యారేజీకి సంబంధించి మరో ముందడుగు పడింది. ప్రాజెక్టుకు అవసరమైన నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేయాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి(Chhattisgarh CM Vishnu Deo Sai)ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన విష్ణుదేవ్ సాయి.. ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

రాయ్‌పూర్‌లో కీలక భేటీ

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy).. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీ వివరాలను వివరించారు. బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశముందని రేవంత్ వివరించారు. సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుకు మిగిలిన అనుమతులను కూడా త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ముంపు 33 ఎకరాలే.. ఐఐటీ నివేదిక

తొలుత కాంతనపల్లి వద్ద ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించగా.. సుమారు 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో పాటు 17 ఆదివాసీ గ్రామాలపై ప్రభావం పడుతుందని అంచనా వేశారు. దీంతో ముంపును తగ్గించేందుకు నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు.

ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం ప్రకారం.. బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. భారీ వరదల సమయంలోనూ ఈ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని నివేదికలో వెల్లడైంది. ఈ అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.9.883 కోట్లు చెల్లించింది.

6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం

తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. పూర్తిస్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించి భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌ఓసీతో పాటు మిగిలిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఛత్తీస్‌గఢ్ సీఎం ఇచ్చిన హామీతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చే దిశగా ఆశలు చిగురించాయి.

మరిన్ని వార్తలు