ఉత్తరాఖండ్లో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి
ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి సుమారు 100 మీటర్ల దిగువన నీటిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడ్డారు.
రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై మంగళవారం గూలర్ బజార్ సమీపంలో ఈ ప్రమాదం (Bus Accident) జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు వంతెనపై నుంచి నీటిలో పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు (Rescue Teams) వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.