అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.
ములకలపల్లి,అక్టోబర్ 2 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల అందించడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ(MLA Jare Adinarayana) అన్నారు.శుక్రవారం ఆయన ములకలపల్లి మండలం జగన్నాధపురం రైతువేదిక,సీతాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వం నూతనంగా శ్రీకారం చుట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన వి బి జి రామ్ జి గ్రామసభలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని ప్రసంగించారు.
మహాత్మా గాంధీ ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు కలిసి పనిచేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలపై ముందుగానే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి వాటిని దశలవారీగా అమలు చేయడం ద్వారా గ్రామపంచాయతీలను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు.ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామ అభివృద్ధికి ప్రజలు ప్రజాప్రతినిధులు రూపొందించే ప్రత్యేక ప్రణాళికలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని స్పష్టం చేశారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలకు తావు లేకుండా నిజమైన పేదలకు ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుడిసెలు లేని అశ్వారావుపేట నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ లక్ష్య సాధన కోసం అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జహీర్,పిసిసి జిల్లా సభ్యులు తాండ్ర ప్రభాకర్ రావు,కారం సుధీర్,సర్పంచులు కుంజా వినోద్,కారం చంద్రలేఖ, తహసిల్దార్ స్వాతి బిందు,ఎంపీడీవో సత్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.