బాపూజీ ఆశయాలే స్ఫూర్తి.. స్వచ్ఛతే లక్ష్యం
సఫాయి మిత్రులకు ఘన సన్మానం.. కార్మికులకు మెగా వైద్య శిబిరం
రాజన్న సిరిసిల్ల 2 అక్టోబర్ (విజయక్రాంతి): మహాత్మాగాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛతలో భాగస్వాములు కావాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి(Sircilla Municipal Chairperson Jindam Kala Chakrapani) పిలుపునిచ్చారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛత హి సేవ–2026, సఫాయి మిత్ర సురక్షా సన్మాన్ శిబిర్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగామహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమవుతుందని పేర్కొన్నారు.
కార్మికుల సేవలు వెలకట్టలేనివి
సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని జిందం కళ చక్రపాణి అన్నారు. వారి సేవలను సమాజంలోని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా సఫాయి మిత్రలను సన్మానించడం ఆనందంగా ఉందని తెలిపారు.
కార్మికుల కోసం మెగా వైద్య శిబిరం
నిత్యం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేసే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్స్, ఎల్లారెడ్డిపేట సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నిపుణులైన వైద్యులతో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైన సలహాలు, సూచనలతో పాటు మందులు అందజేస్తామని చైర్‌పర్సన్ తెలిపారు.
కార్మికుల్లో వైద్య శిబిరంపై నమ్మకాన్ని పెంచేందుకు చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరాన్ని నిర్వహించిన అశ్విని హాస్పిటల్స్ నిర్వాహకులకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ విప్ బుర్ర మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.