ఆర్టీసీ ఎన్నికల్లో ‘అధికార’ జోక్యం!
- టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ మద్దతు
- ప్రస్తుతానికి బీఆర్ఎస్, బీజేపీ సైలెంట్
- ఈ నెల 9న ఎన్నికలు
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ఆర్టీసీ(RTC) కార్మిక పోరు.. పొలిటికల్ వార్‌లా మారింది. కాంగ్రెస్ ఎంట్రీతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నెల 9న జరగను న్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్(Telangana Workers Union), ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు అధికార పార్టీ అండగా నిలవడంతో.. ఎన్నికలు నువ్వా నేనా అనే రీతిలో జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ప్రస్తుతానికి తటస్థ వైఖరి అవలంభిస్తుండటం విశేషం.
ఆర్టీసీని బ్రాండ్ అంబాసిడర్‌గా భావిస్తున్న కాంగ్రెస్
భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన యూనియన్ గెలుపొందడం అత్యవసరంగా మారిందనే చెప్పవ చ్చు. ఎందుకంటే.. రాబోయే రెండేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టీసీని కాంగ్రెస్ పార్టీ తమకు బ్రాండ్ అంబాసిడర్‌గా భావిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథ కాలపై ప్రచారాన్ని మారుమూల గ్రామాలకు సైతం తీసుకుపోయే సాధనంగా భావి స్తోంది.
అందుకే సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతో.. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud), మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)తోపాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జీలు గురువారం జూమ్ మీటింగ్ నిర్వహిం చారు. తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆర్టీసీ డిపోల్లో టీడబ్ల్యూయూకు మద్దతుగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఏ ఒక్క డిపోలో యూనియన్ ఓడి నా, నియోజకవర్గ ఇంఛార్జీ బాధ్యతగానే పరిగణిస్తామని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఆర్టీసీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సహాయ సహకారాలు, కార్మికులకు చేసిన లాభాలను ప్రచారం చేసి గెలవాలని స్పష్టం చేశారు. దీనితో ఆర్టీసీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ప్రవేశించినట్టుగా కార్మికులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రతిపక్షాల దారి ఎటు?
ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ఇంకా తటస్థ వైఖరినే ప్రదర్శిస్తున్నా యి. బహిరంగంగా మద్దతు ప్రకటిస్తాయా? కార్మిక సంఘాల నేతలతో మాట్లాడి అంతర్గత మద్దతు ఇస్తాయా? లేకుంటే తమకెందు కులే అని కార్మికులకే వదిలేస్తారా? అనేదానిపై స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం పట్టభద్రుల ఎన్నికలు కీలకమని భావిస్తున్న నేపథ్యంలో దృష్టి మొత్తం దానిపై ఈ రెండు పార్టీలు కేంద్రీకరించాయి. బీజేపీకి అనుబంధ సంఘం బీఎంఎస్ పోటీలో ఉన్నప్పటి కీ.. చెప్పుకోదగ్గ స్థాయిలో ఆ సంఘం పోటీ ఇవ్వడం లేదని బీజేపీ నేతల్లోనూ చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకూడా ఆ దిశగా దృష్టి సారించడం లేదని తెలుస్తోంది.
గుర్రుగా కూటమి సంఘాలు
ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రధాన పోటీదారు అయిన ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూల కూటమి కార్మిక నేతలు మాత్రం అధికార పక్షం కాంగ్రెస్‌పై కాస్తా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కార్మికుల ఎన్నికల్లోకి రాజకీయ పార్టీలు ప్రవేశిస్తే.. కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఇప్పటికే ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేలా ప్రైవేటు ఈవీ బస్సులను హైర్ చేస్తుండటంపై మెజారిటీ కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి.
మరోవైపు ఆర్టీసీ ఎన్నికల నిర్వహణకు దాదాపు మూడేండ్ల కాలం పట్టడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తుది నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నండటంతో కార్మికుల్లో అసహనం నెలకొంది. ఇప్పుడు టీడబ్ల్యూయూ సంఘానికి కాంగ్రెస్ మద్దతు తెలపడంపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికార పార్టీ సహకరించాలే కానీ, ఒక సంఘానికి బహిరంగంగా మద్దతు తెలపడం ఏమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కార్మిక వర్గంలో చీలిక తీసుకొచ్చే ప్రయత్నమేనని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నాయ.
రెండు కూటముల మధ్యే పోటీ
రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. గడిచిన కొంత కాలంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రైవేటు ఎలక్ట్రికల్ బస్సులను నేరుగా ఆర్టీసీయే కొనుగోలు చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయాలను తప్పు పడుతూ ప్రచారం చేస్తున్న కూటమి ఒకవైపు ఉంది. మరోవైపు అధికారపక్షం అండదండలతో.. సంప్రదాయంగా కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐ ఎన్టీయూసీ కాకుండా.. వేరే కూటమిని తెరపైకి తీసుకొచ్చి బలంగా పోటీ ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 97 డిపోల పరిధిలో 36 వేల మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.