డాక్టర్ ఎస్.ఎన్. సుబ్బారావు వర్ధంతి వేడుక
ముకరంపుర, అక్టోబర్ 25(విజయక్రాంతి) : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, చంబల్ గాంధీగా పేరుగాంచిన డాక్టర్ ఎస్.ఎన్. సుబ్బారావు(Dr. SN Subbarao) ఐదవ వర్ధంతి సందర్భంగా తీగలగుట్టపల్లి లోని మేయర్ క్యాంప్ కార్యాలయం లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(City Mayor Kolagani Srinivas) నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. డాక్టర్ ఎస్.ఎన్. సుబ్బారావు తన జీవితమంతా దేశసేవకు, యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించడానికి అంకితం చేసిన మహనీయులని కొనియాడారు.
చంబల్ లోయల్లో బందిపోట్లుగా జీవించిన వారిని అహింసా మార్గంలోకి తీసుకువచ్చి, జనజీవన స్రవంతిలో కలిసేలా కృషి చేసిన గొప్ప మానవతావాది భాయీజీ అని పేర్కొన్నారు. ఆచార్య వినోబా భావే, జయప్రకాశ్ నారాయణ్ వంటి ప్రముఖుల స్ఫూర్తితో పనిచేస్తూ శాంతి, అహింస, మానవతా విలువలను సమాజంలో పెంపొందించేందుకు నిరంతరం కృషి చేశారని తెలిపారు.
యువతే దేశానికి వెన్నెముక అనే నమ్మకంతో నేషనల్ యూత్ ప్రాజెక్ట్(National Youth Project)ను స్థాపించి, గ్రామస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల వరకు యువజన శిబిరాలను నిర్వహించారని మేయర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలొ నేషనల్ యూత్ ప్రాజెక్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వైపీ కే. యాదవ రాజు, పెద్దపల్లి జిల్లా ఆంగ్లభాష రిసోర్స్ పర్సన్ గడ్డం జగదీష్, మై భారత్ కరీంనగర్ మాజీ ప్రోగ్రామ్ కన్వీనర్ రవీందర్, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, గాండ్ల నరేష్, వడ్డేపల్లి రాజు, కొలగాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.