పోక్సో చట్టంతో చిన్నారులకు పటిష్ట రక్షణ
సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్
ముకరంపుర, అక్టోబర్ 28(విజయ క్రాంతి): బాలల హక్కుల పరిరక్షణకు, వారిపై జరిగే నేరాల నివారణకు చట్టాలు పటిష్టమైన రక్షణ కల్పిస్తున్నాయని, ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్(Senior Civil Judge Yashwant Singh) అన్నారు.
ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడమే లక్ష్యంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకత్వంలో చేపట్టిన ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’లో భాగంగా బుధవారం కరీంనగర్లోని మంకమ్మతోట ధన్గర్వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడవ రోజు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యశ్వంత్ సింగ్ విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం–2012, 18 ఏళ్లలోపు బాలబాలికలను లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, ఇతర లైంగిక నేరాల నుంచి రక్షించేందుకు రూపొందించబడిందని వివరించారు.
ఈ చట్టం కింద నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. బాధిత చిన్నారుల గుర్తింపు, వ్యక్తిగత వివరాలు బహిర్గతం కాకుండా వారి గౌరవం, గోప్యతను కాపాడటం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవధికార సంస్థ, సభ్యులు, న్యాయవాది ఏ. కిరణ్ కుమార్, టూ టౌన్ యస్.ఐ నరేష్ రెడ్డి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లు ఎలుగు తన్మయి, మర్రి భావన, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొట్టే ప్రమోద, పాఠశాల చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.