సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేయాలి
ప్రధాని మోదీకి లేఖ రాసిన మాజీ ఎంపీ గొట్టె భూపతి
కరీంనగర్,(విజయక్రాంతి): పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ(Peddapalli Parliament Constituency) పరిధిలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ గొట్టె భూపతి(Former MP Gotte Bhupathi) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)కి లేఖ రాశారు. పెద్దపల్లి ప్రాంతంలో సింగరేణి కాలరీస్, ఎన్టీపిసి, ఎరువుల కర్మాగారంతో పాటు ఎన్నో భారీ పరిశ్రమలు నెలకొని ఉన్న విషయాన్ని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. వీటితోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలలో తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారని మాజీ ఎంపీ భూపతి ప్రధానికి రాసిన లేఖలో వివరించారు.
అనేక పరిశ్రమలకు పాలవాళంగా మారిన ఈ ప్రాంతంలో దశాబ్దాల నుంచి స్థిర నివాసం ఏర్పరుచుకుని జీవనం సాగిస్తున్న వారు కూడా ఉన్నారని ఉదాహరణలతో పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికుల పిల్లలు ప్రైవేటు కాలేజీలు, విద్య సంస్థల్లో చేరడానికి చాలా సమస్యలున్నాయని, అందులో ప్రధానమైనది ఆర్థిక సమస్య అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్మిక కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో సెంట్రల్ వర్సిటీని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని పరిశ్రమలు, సంస్థలతోపాటు ప్రైవేటు పరిశ్రమలు, సంస్థల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకుని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన ప్రధానిని కోరారు. ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఈ విషయంపై దృష్టి సారించి, పారిశ్రామిక పట్టణంగా గుర్తింపు పొందిన పెద్దపల్లి లేదా గోదావరిఖని ప్రాంతాల్లో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ గొట్టె భూపతి ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.