కేజీబీవీలో ఘనంగా ‘స్వచ్ఛత హీ సేవ’

19-09-2026 | 06:01pm

మొక్కలు నాటిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బిందు ప్రియ*

ముదిగొండ, విజయక్రాంతి :సెప్టెంబర్ 19: ‘స్వచ్ఛత హీ సేవ’(Swachhta Hi Seva) కార్యక్రమంలో భాగంగా స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో(Kasturba Gandhi Girls' School) ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బిందు ప్రియ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.అనంతరం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో విద్యార్థినులకు న్యాయ విజ్ఞాన సదస్సు (లీగల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్) నిర్వహించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి విద్యార్థి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం వల్ల సమాజంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవచ్చని, లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సామాన్యులకు లభించే ఉచిత న్యాయ సేవలను గురించి వివరించారు.అనంతరం ఆమె పాఠశాలలోని స్టోర్ రూమ్‌ను, భోజన శాలను, నిల్వ ఉంచిన నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఐ మురళి విద్యార్థినులకు మాదకద్రవ్యాల నివారణ (యాంటీ డ్రగ్స్), సైబర్ సెక్యూరిటీ, బాలల హక్కులు (చైల్డ్ రైట్స్) తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో ఎదురయ్యే సైబర్ మోసాలు, ప్రమాదాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఏదైనా ఆపద లేదా సమస్య ఎదురైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలని లేదా సంబంధిత హెల్ప్‌లైన్‌లను ఆశ్రయించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవి కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కళ్యాణి, మండల విద్యాశాఖ అధికారి రమణయ్య, కస్తూరిబా ప్రత్యేక అధికారి (ఎస్ఓ) బండారు ఇందిర, ఇంచార్జి ఎంపీఓ రామకృష్ణ, ఏపీఓ రమాదేవి, స్థానిక సర్పంచ్ సలీమా ఖాసీం బాబు, ఉప సర్పంచ్ రమాదేవి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వెంకట లక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ స్వరూపతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు