విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి
తాడ్వాయి,(విజయక్రాంతి): విద్యార్థులు ఇంగ్లీష్ భాషలో నైపుణ్యాన్ని సాధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని తాడ్వాయి ఎంఈఓ రామస్వామి(Tadwai MEO Ramaswamy) తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఇంటి వద్ద స్టడీ కార్నర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానికి తగ్గట్టుగా సాధన చేయాలన్నారు.
పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి విద్యార్థుల(Students) తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థులు పరీక్షలలో వారి ప్రతిభ సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మోహన్ మాట్లాడుతూ... విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోక్సో చట్టం గురించి సంపూర్ణ అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలన్నారు.సెల్ ఫోన్ లకు దూరంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.