మైనింగ్ గుంత బలితీసుకుంది!

10-10-2026 | 05:47pm
  1. నీటి గుంతలో పడి యువకుడి దుర్మరణం 
  2. కొర్పోల్ గ్రామంలో మిన్నంటిన రోదనలు
  3. గుత్తేదారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తుల ఆగ్రహం.. ఎస్సైకి ఫిర్యాదు 

లింగంపేట, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): కాలకృత్యాల కోసం బయటకు వెళ్లిన ఓ యువకుడు అక్రమ మైనింగ్(Illegal mining) వల్ల ఏర్పడిన ప్రమాదకర నీటి గుంతలో(Dangerous water pit) పడి మృతి చెందిన విషాదకర సంఘటన శనివారం కామారెడ్డి జిల్లా(Kamareddy District) లింగంపేట మండలంలోని కొర్పోల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొర్పోల్ గ్రామానికి చెందిన చాకలి సాయిలు రెండో కుమారుడు చాకలి సురేష్(Chakali Suresh)(24) శుక్రవారం రాత్రి కాలకృత్యాల నిమిత్తం గ్రామ శివారులోకి వెళ్లాడు. రాత్రంతా ఎంత ఎదురుచూసినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

శనివారం ఉదయం పరిసర ప్రాంతాల్లో గాలించగా, గతంలో మైనింగ్ తవ్వకాల(Mining operations) వల్ల ఏర్పడిన నీటి కుంట సమీపంలో సురేష్ బైక్ కనిపించింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, స్థానికులు కుంటలోకి దిగి చూడగా సురేష్ మృతదేహం లభ్యమైంది. చీకట్లో కాలుజారి గుంతలో పడిపోవడంతోనే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. చేతికందిన కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి తండ్రి చాకలి సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లింగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 పూడ్చని గుంతలు.. నిండు ప్రాణాలు బలి

గ్రామంలో మైనింగ్ కోసం తవ్వి వదిలేసిన భారీ గుంత ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గ్రామస్తుల సమక్షంలో మహేందర్ రెడ్డి, గణేష్ అనే వ్యక్తులు రెండేళ్ల గడువుతో మైనింగ్ కోసం స్థలాన్ని తీసుకున్నారని, తవ్వకాలు ముగిసిన తర్వాత ఆ గుంతను పూడ్చివేయాలనే నిబంధనను ఉల్లంఘించారని ఆరోపించారు.

పరిమితికి మించి లోతుగా తవ్వి గుంతను అలాగే వదిలేయడం వల్ల తరచూ మూగజీవాలు పడి చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సాలే ప్రశాంత్ అనే యువకుడు, ఇప్పుడు సురేష్ ప్రాణాలు కోల్పోవడానికి గుత్తేదారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ప్రమాదకరంగా మారిన గుంతను వెంటనే పూడ్చివేయాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని కోరుతూ లింగంపేట ఎస్సైకి గ్రామస్తులు  ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు