నిజాంసాగర్ 25వ నంబర్ కెనాల్ చివరి ఆయకట్టుకు సాగునీరు...
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి...
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో నిజాంసాగర్ 25వ నంబర్ కెనాల్ ద్వారా చివరి ఆయకట్టులోని కొల్లూరు, నాగారం, దామరంచ, అన్నారం గ్రామాల రైతుల పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivas Reddy) దృష్టికి తీసుకువచ్చారు.
రైతుల సమస్యను తెలుసుకున్న పోచారం వెంటనే సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి, 25వ నంబర్ కెనాల్‌లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టి, వ్యర్థాలను తొలగించి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కొల్లూరు, నాగారం, దామరంచ, అన్నారం గ్రామాల రైతుల పొలాలకు సాగునీరు చేరడంతో చివరి దశలో ఉన్న పంటలకు ఎంతో మేలు జరిగింది. సాగునీరు అందడంతో ఆనందం వ్యక్తం చేసిన రైతులు, తమ సమస్యను వెంటనే పరిష్కరించి పంటలను కాపాడినందుకు పోచారం కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాకుండా, 25వ నంబర్ కెనాల్ చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా మరో రెండు రోజుల పాటు నిజాంసాగర్ నుంచి కెనాల్‌కు నీటిని కొనసాగించాలని రైతుల అభ్యర్థన మేరకు పోచారం ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చివరి ఆయకట్టు రైతు పొలానికి కూడా నీరు అందాలి ప్రతి ఎకరం పచ్చగా ఉండాలి అనే లక్ష్యంతో రైతుల సమస్యల పరిష్కారానికి పోచారం నిరంతరం కృషి చేస్తున్నారని ఆయా గ్రామాల రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు, నాగారం, దామరంచ, అన్నారం గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.