కొమురం భీమ్‌ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

28-10-2026 | 05:40pm

గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్‌

మహదేవపూర్, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): కొమురం భీమ్‌ పోరాట స్ఫూర్తి, త్యాగం నేటి తరానికి ఆదర్శమని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్‌(Tribal Welfare Officer Nagasagar) అన్నారు. బుధవారం మహాదేవపూర్‌లోని దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో కొమురం భీమ్‌ 86వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాగసాగర్‌ మాట్లాడుతూ.. గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల కోసం కొమురం భీమ్‌ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ‘జల్‌,జంగల్‌,జమీన్‌’ నినాదం గిరిజనుల హక్కులకు ప్రతీక అని పేర్కొన్నారు. గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, గిరిజన హక్కులను పరిరక్షించడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు.

అనంతరం భూపాలపల్లిలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించిన నాగసాగర్‌ విద్యా, వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, బోధన, వసతి గృహంలోని తాగునీరు, పారిశుద్ధ్యం, భోజన వసతులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి మెరుగైన ఫలితాలు సాధించేలా బోధన చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజాబాబు, మహాదేవపూర్‌ సర్పంచ్‌ హసీనా భాను, ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు