విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక
జిల్లా ప్రజలకు ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు
ఎస్పీ కార్యాలయంలో ఘనంగా ఆయుధ, వాహన పూజలు
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sankeerth) అన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్లలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో ఆయుధాలకు, ఎం టి విభాగంలో పోలీస్ వాహనాలకు ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పండుగను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, అత్యవసర సమయాల్లో సత్వర సేవలందించడంలో ఆయుధాలు, పోలీస్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో జిల్లాలో శాంతిభద్రతలను పటిష్టంగా కొనసాగిస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, ఎస్బీ సీఐ నరేష్, భూపాలపల్లి టౌన్ సీఐ శ్రీనివాస్, ఆర్ఐలు సంతోష్, రత్నం, పూర్ణచందర్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.