ప్రాణహిత నీటిని ఒడిసిపట్టి రైతులకు అందించాలి

19-10-2026 | 05:27pm

కన్నెపల్లి వద్ద కాఫర్‌ డ్యాం నిర్మించాలి

నవంబర్‌ నెలాఖరులోగా పనులు ప్రారంభించకపోతే ఆందోళన

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

భూపాలపల్లి/కాళేశ్వరం,(విజయక్రాంతి): రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కన్నెపల్లి పంప్‌హౌస్‌(Kanneppalli Coffer Dam) వద్ద వృథాగా ప్రవహిస్తున్న ప్రాణహిత జలాలను రైతులకు(Farmers) అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత(Telangana Rakshana Sena Chief Kalvakuntla Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద కాఫర్‌ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లిస్తే మేడిగడ్డను బైపాస్‌ చేస్తూ రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోసుకోవచ్చని తెలిపారు.

పార్టీ నాయకులతో కలిసి సోమవారం కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ప్రాణహిత నది ప్రవాహాన్ని పరిశీలించిన కవిత మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ కన్నెపల్లి వద్ద రోజుకు సుమారు రెండు టీఎంసీల నీరు వృథాగా ప్రవహిస్తోందన్నారు. బ్యారేజీలు మరమ్మతుల్లో ఉన్నాయనే కారణంతో మూడేళ్లుగా వేల టీఎంసీల నీటిని వృథా చేశారని ఆరోపించారు.

రాష్ట్రంలో 21 వేల చెరువులు ఎండిపోవడంతో వాటిపై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సుమారు రూ.25 కోట్లతో నెలన్నర రోజుల్లో కాఫర్‌ డ్యాం నిర్మిస్తే ప్రాణహిత నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. నవంబర్‌ నెలాఖరులోగా కాఫర్‌ డ్యాం పనులు ప్రారంభించకపోతే కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ఆందోళన చేపడతామని కవిత హెచ్చరించారు.

సమస్యపై ప్రశ్నించడంతో పాటు పరిష్కార మార్గాన్ని కూడా ప్రభుత్వానికి సూచిస్తున్నామని తెలిపారు. నిపుణులతో చర్చించిన అనంతరమే ఈ ప్రతిపాదనను చేస్తున్నామని, ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సూచనలను పరిగణనలోకి తీసుకుని రైతులకు మేలు చేయాలని కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని, రైతుల ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడాలని కవిత పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు