వారికే ఆర్థిక సహాయం

24-10-2026 | 08:39pm

రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా ఆర్థిక సహాయం 

సీఎస్‌ సంజయ్‌ జాజు

ఆసిఫాబాద్‌,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల్లో(Road Accident) గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స(medical treatment) అందించేందుకు ప్రధానమంత్రి రహత్‌ పథకం(PM Rahat Scheme) ద్వారా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలను 24 గంటల్లోపు, తీవ్రంగా గాయపడిన వారి వివరాలను 48 గంటల్లోపు ఈ-దార్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పథకంపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితికా పంత్‌, అదనపు ఎస్పీ (అడ్మిన్‌) చిత్తరంజన్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్‌ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందేలా జిల్లాలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, రహదారులు భవనాల శాఖ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఈ-దార్‌ మేనేజర్‌ లక్ష్మణ్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు