డిజిటల్ భూ రీ-సర్వేతో రైతులకు భరోసా
రైతుల భూముల వద్దకే అధికారులు
నిర్ణీత గడువులోగా కచ్చితత్వంతో పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
గణపురం,(విజయ క్రాంతి): డిజిటల్ భూ రీ-సర్వే(digital land re-survey)తో రైతులకు భరోసా ఉంటుందని రైతుల భూముల వద్దకే అధికారులు వస్తారని నిర్ణీత గడువులోగా కచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అన్నారు. గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామపంచాయతీ శివారులోని తూపురం వద్ద జరుగుతున్న డిజిటల్ భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే అధికారులు, సిబ్బందితో మాట్లాడి పనుల పురోగతి, అనుసరిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
భూ రీ-సర్వేను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రీ-సర్వే కోసం ఎంపిక చేసిన 70 గ్రామాల్లో ప్రస్తుతం 12 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని, మిగిలిన గ్రామాల్లోనూ సర్వేను ప్రారంభించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ల భద్రత కోసం గమ్‌షూస్, ఇతర రక్షణ పరికరాలను సమకూర్చాలని ఆదేశించారు.
రోవర్ తదితర ఆధునిక సాంకేతిక పరికరాలను సమర్థవంతంగా వినియోగించి సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గణపురం మండలంలో ఎంపిక చేసిన ఆరు గ్రామాల్లో ప్రస్తుతం మూడు గ్రామాల్లో రీ-సర్వే జరుగుతోందన్నారు. రీ-సర్వే అనంతరం ప్రతి రైతుకు వారి భూమికి సంబంధించిన స్పష్టమైన భూధార్ సంఖ్య, భూ మ్యాపులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీనివల్ల భూ రికార్డుల్లో పారదర్శకత పెరగడంతో పాటు భూ వివాదాల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత భూముల రీ-సర్వే జరుగుతున్నందున రైతులు సర్వే సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ కోరారు. రీ-సర్వే ప్రక్రియపై రైతులకు పూర్తి అవగాహన కల్పించి, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు.






