దళిత, మైనార్టీ కౌన్సిలర్లకు చిన్నచూపు ఎందుకు?

10-09-2026 | 06:18pm

- చైర్ పర్సన్ కడమంచి బాలమణిపై చర్యలు తీసుకోవాలి

జనగామ,(విజయక్రాంతి): జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడమంచి బాలమణి(Municipal Chairperson Kadamanchi Balamani) దళిత, మైనార్టీ కౌన్సిలర్ల పట్ల అవమానకరంగా, చులకనగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లిన తమను గౌరవించకుండా "మీకు తలకాయ ఉందా?" అంటూ అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వివక్షపూరిత వైఖరి ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా పలుమార్లు ఇదే తరహాలో ప్రవర్తించారని తెలిపారు.

ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానించడం సరికాదని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడాన్ని సహించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై దళిత, మైనార్టీ కౌన్సిలర్లు పానుగంటి సువార్త, మంజుల, సాజిత్, పాతిమా సమద్ గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐకి ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి చైర్ పర్సన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయంపై సిడిఎంఏకి, తెలంగాణ మహిళా కమిషన్ కి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు