దేశ ఐక్యతకు మార్గదర్శకుడైన వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని స్మరించుకుందాం
జగిత్యాల,(విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, భారతరత్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్(Jagtial SP Ashok Kumar) పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎస్పీ ఆద్వర్యంలో రాస్ట్రియ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయటం జరిగింది.
ఈ ప్రతిజ్ఞలో భాగంగా మన దేశం ఐక్యతను, సమగ్రతను, భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేస్తున్నానని, నా తోటి ప్రజల్లోకి ఈ సందేశాన్ని పంపియటానికి నా వంతు కృషి చేస్తున్నానని ప్రమాణం చేయటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలోని సంస్థానాలను విలీనం చేసి అఖండ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
సర్దార్ పటేల్ సేవలను స్మరిస్తూ వారి జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ సందర్భంగా దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు వేణు, సైదులు, శ్రీధర్, ఆర్ ఎస్ ఐ లు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.