నకిలీ కస్టమర్ కేర్, పెట్టుబడి మోసాలు, స్క్రీన్ షేరింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
జగిత్యాల, నవంబర్ 03 ( విజయ క్రాంతి ): సైబర్ ఆర్థిక నేరాలను(cyber financial crimes) అరికట్టి ప్రజల్లో సురక్షితమైన డిజిటల్ లావాదేవీలపై(Digital transactions) అవగాహన పెంపొందించేందుకు నవంబర్ నెల మొత్తం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా “YOUR MONEY, YOUR CLICK, YOUR CHOICE” అనే ప్రధాన ఇతివృత్తంతో, “Pause the Payment – Verify the Person” అనే నినాదంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ నేరాల నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త పద్ధతులను అనుసరిస్తూ ప్రజలను ఆర్థిక మోసాలకు గురిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆన్లైన్లో డబ్బులు చెల్లించే ముందు క్షణం ఆగి, డబ్బులు స్వీకరించే వ్యక్తి లేదా సంస్థ వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని తెలిపారు.ముఖ్యంగా ఆన్లైన్ ప్రకటనల ద్వారా వస్తువులు, సేవలు అందిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి వస్తువులు డెలివరీ చేయకుండా మోసాలకు పాల్పడటం, వ్యక్తిగత వివరాలను దొంగిలించి క్రెడిట్, డెబిట్ కార్డులను అనధికారికంగా వినియోగించడం, స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపుతూ నకిలీ పెట్టుబడి పథకాల పేరుతో మోసం చేయడం వంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను నమ్మి సంప్రదించవద్దని, గూగుల్ లేదా సోషల్ మీడియాలో కనిపించే ప్రతి కస్టమర్ కేర్ నంబర్ నిజమైనదని భావించవద్దని తెలిపారు. అపరిచితుల సూచనల మేరకు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఇన్స్టాల్ చేయవద్దని, ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని స్పష్టం చేశారు.
అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా, చెల్లింపుల సమయంలో లబ్ధిదారుల పేరు, ఖాతా వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. ఎవరైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైనట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలువరించే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు, సైబర్ క్రైమ్ ఎస్.ఐ కృష్ణ, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.