ప్రాథమిక సహకార సంఘం భవనాన్ని ప్రారంభిస్తున్న సర్పంచ్

23-11-2026 | 05:16pm

ఎట్టకేలకు ధోప్టాలలో ప్రాథమిక సహకార సంఘం కేంద్రం ప్రారంభం

బేల నవంబర్ 23 (విజయక్రాంతి): బేల మండలంలోని ధోప్టాల గ్రామ ప్రజలు, రైతుల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. దశాబ్దాల కాలంగా ధోప్టాల ప్రాథమిక సహకార సంఘం(Primary Cooperative Society) సేవలు బేల మండల కేంద్రం నుంచే కొనసాగుతున్నాయి. దీంతో ధోప్టాల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు సహకార సంఘానికి సంబంధించిన వివిధ పనుల కోసం బేల మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీనివల్ల రైతులు సమయం, ప్రయాణ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను గుర్తించిన ధోప్టాల గ్రామ సర్పంచ్ బోడకుంటి వెంకటమ్మ, రాకేష్ ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామంలోనే ప్రాథమిక సహకార సంఘం కేంద్రం ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, కేంద్రం ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేశారు. వారి ప్రయత్నాలు ఫలించడంతో సోమవారం ధోప్టాల గ్రామంలో నూతన ప్రాథమిక సహకార సంఘం కేంద్రాన్ని ప్రారంభించారు.ఇకపై గ్రామ రైతులకు సహకార సంఘం సేవలు స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయి.

గతంలో చిన్నచిన్న పనుల కోసం సైతం బేల కు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం గ్రామంలోనే కేంద్రం ఏర్పాటు కావడంతో రైతులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అవసరాలను గుర్తించి ప్రత్యేక చొరవతో కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన సర్పంచ్ బోడకుంటి వెంకటమ్మ, రాకేష్‌కు గ్రామ ప్రజలు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించడంతో ధోప్టాల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ చైర్మన్ జితేందర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, గ్రామస్థులు మోరేశ్వర్, లక్మణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు