6 September, 2026 | 2:46 PM

కేసీఆర్ సభకు రావాలి... అనుభవాన్ని పంచుకోవాలి

06-09-2026 | 12:47pm

ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేస్తాం

కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ 

టీపీసీసీ ఆధ్వర్యంలో మహా ధర్నా

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలతో రోడ్లపై మాట్లాడించటం కాదు.. సభకు వస్తే సమాధానం చెప్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నాడు టీపీసీసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించింది. వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటూ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, అసెంబ్లీకి హాజరు కాకుండా ఉన్న ప్రతిపక్ష నాయకుడు, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసనకు దిగింది.  ఈ మహా ధర్నాలో కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ....  కాంగ్రెస్ పార్టీ జవాబుదారీతనంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ సభకు వచ్చి ఆయన అనుభవాన్ని పంచుకోవాలని శ్రీధర్ బాబు కోరారు. విపక్షాలు సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారాలను తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఆర్టీసీ బస్సుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఉచిత ప్రయాణం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుడి వైఖరి మారకుంటే.. మరో పదేళ్లు కూడా వాళ్లు రోడ్ల మీద ఉంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డు కూడా దౌర్భాగ్య పాలన పదేళ్ల పాటు సాగిందని మండిపడ్డారు.  ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు డిమాండ్  చేస్తున్న అంశాలను పదేశ్ల పాటు ఎందుకు అమలు చేయలేదు?, బీఆర్ఎస్ , బీజేపీ కార్యకర్తలకు రేషన్ కార్డు రాలేదా? సన్నబియ్యం తీసుకోవట్లేదా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రెండున్నరేళ్లలోనే రైతుల ఖాతాల్లో రూ. 1.60 లక్షల కోట్లు జమ చేశామన్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లేలోపు ఆరు గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 8 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ తమకు అప్పగించారని తెలిపారు. రూ. 8 లక్షల కోట్ల అప్పుపై అసలు, వడ్డీ చెల్లిస్తూ సంక్షేమం కూడా అమలు చేస్తున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్-1 నియామకాలు జరగలేదని ఆరోపించారు.


మరిన్ని వార్తలు