పారిశ్రామిక జోరు!

07-09-2026 | 05:45am

పరిశ్రమలకు ప్లాట్‌ఫామ్‌గా తెలంగాణ

190కి పైగా ఇండస్ట్రియల్ పార్కులు

  1. కంపెనీలకు 20,110 యూనిట్ల కేటాయింపు
  2. పరిశ్రమలకు అందుబాటులో 53 వేల ఎకరాలు
  3. రూ.3,048 కోట్లతో మౌలిక వసతులు కొత్త పరిశ్రమలకు 27,507 ఎకరాల ప్రతిపాదనలు
  4. ఇప్పటికే 8,089 ఎకరాల సమీకరణ
  5. భారీ పెట్టుబడులు, ఉపాధి కల్పనే లక్ష్యం

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి) : తెలంగాణలో పారిశ్రామిక (Industrial in Telangana) కార్యక లాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం, తెలంగా ణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) (Telangana Industrial Infrastructure Corporation) దృష్టి సారించాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 190కి పైగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు కాగా.. ఆయా పార్కు ల్లో 20,110 యూనిట్లు కంపెనీలకు కేటాయించినట్లు టీజీఐఐసీ తాజా నివేదిక వెల్ల డించింది.

పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమి 53 వేల ఎకరాలకు పైగా ఉన్నట్లు పేర్కొంది. ఈ గణాంకాలు రాష్ట్రంలో పారిశ్రామిక భూములకు ఉన్న డిమాండ్, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని స్పష్టం చేస్తున్నాయి.పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను విస్తరించడంతో పాటు, కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.   భూములు కేటాయించడమే కాకుండా, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపైనా టీజీఐఐసీ దృష్టి సారించింది.

రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, నీటి వసతి, విద్యుత్ తదితర మౌలి క సౌకర్యాలకు సంబంధించిన పనులు పారిశ్రామిక ప్రాంతాల్లో కొనసాగుతున్నా యి. ప్రస్తుతం రూ.3,048.19 కోట్ల అంచ నా వ్యయంతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే రూ.958.17 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభు త్వం పారిశ్రామిక భూములతో పాటు మౌలిక సదుపాయాలపైనా భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

భూముల సమీకరణకు డిమాండ్..

కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు అవసరమైన భూ సమీకరణ కూడా కీలక అంశం గా మారింది. 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు వివిధ ప్రాంతాల్లో 27,507 ఎకరాల కోసం ప్రతిపాదనలు అందాయి. ఇందులో 8,089 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టీజీఐఐసీ నివేదిక తెలిపింది. రాష్ట్ర పారిశ్రామిక విస్తరణలో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ కీలక ప్రాజెక్టుగా నిలుస్తోంది.

ఎన్‌ఐసీడీఐటీ పరిధిలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.2,360.54 కోట్ల అంచనా వ్యయం ఉండగా, దాదాపు రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యం ఉంది. అంతేకాకు ండా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా కలిపి 1.74 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని టీజీఐఐసీ పేర్కొంది. జహీరాబాద్ ప్రాజెక్టులో తొలి దశ భూ స మీకరణ కూడా తుది దశకు చేరింది. మొద టి దశలో 3,170.48 ఎకరాల భూమి సమీకరణకు గానూ 97.7 శాతం పూర్తయినట్లు నివేదిక పేర్కొంది.

ఇంకా 75 ఎకరాల భూ మి సేకరించాల్సి ఉంది. అయితే భారీ ప్రాజెక్టులకు కేవలం భూ సమీకరణే కాకుండా, మౌలిక వసతుల అభివృద్ధి కూడా అదే వేగంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. జహీరాబాద్ ప్రాజెక్టులో రూ.1,260.73 కోట్ల కాంట్రాక్ట్ విలువతో 47.8 కిలోమీటర్ల రోడ్లు, యుటిలిటీ పనులు చేపట్టగా.. నివేదిక ప్రకారం భౌతిక ప్రగతి 3.18 శాతంగా, ఆర్థిక ప్రగతి రూ.31.73 కోట్లుగా ఉంది.

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మరో కీలక కేంద్రం..

తెలంగాణలో పారిశ్రామిక వికేంద్రీకరణ కు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మరో ఉ దాహరణగా నిలుస్తోంది.1,327 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కులో సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు రావచ్చని, దాదాపు లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఉన్నట్లు టీజీఐఐసీ నివేదిక పేర్కొంది. టెక్ట్స్‌టైల్ రంగంలో పెట్టుబడులు, తయారీ యూనిట్లు, అనుబంధ పరిశ్రమలు ఒకే ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉండటంతో ఇలాంటి మెగా పార్కులు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశముంది.

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందు కు ఈఎంసీల అభివృద్ధిపైనా దృష్టి పెట్టారు. తాడిపర్తి జువీకు 623.90 ఎకరాల విస్తీర్ణం ఉండగా, ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.878.46 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ రూ.350 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ.528.46 కోట్లు. ఈ పార్కు ద్వారా సుమారు రూ.8,500 కోట్ల పెట్టుబడులు, 15 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దివిటిపల్లిలోని ఈఎంసీ కూడా మరో ముఖ్యమైన ప్రాజెక్టుగా ఉంది.

అక్కడ 377.65 ఎకరాల భూమిలో పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్టు ఆమోదిత వ్యయం రూ.569.66 కోట్లు కాగా, కేంద్ర గ్రాంట్ రూ.258.10 కో ట్లు, రాష్ట్ర/టీజీఐఐసీ వాటా రూ.311.56 కో ట్లుగా ఉంది. భారీ పరిశ్రమలతో పాటు సూ క్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈ) అవసరమైన ఉమ్మడి మౌలిక వసతుల అభివృద్ధిపైనా టీజీఐఐసీ దృష్టి సారించింది.

ఎంఎస్‌ఈ కింద 25 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఇందులో మూడు కొత్త కామన్ ఫెసిలిటీ సెంటర్లు, ఐదు కొత్త ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు, తొమ్మిది కొత్త ఇండస్ట్రియల్ పార్కులు, ఎనిమిది అప్‌గ్రేడేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది రాష్ట్ర పారిశ్రామిక విధానంలో కేవలం భారీ పెట్టుబడులకే కాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికీ ప్రాధాన్యం ఇస్తున్న సంకేతంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ చుట్టూ పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ..

మరోవైపు హైదరాబాద్ చుట్టూ ఉన్న పారిశ్రామిక వాడల విషయంలోనూ టీజీఐఐసీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. బాలానగర్, కాటేదాన్, కూకట్‌పల్లి వంటి పాత పారిశ్రామిక ప్రాంతాలు ప్రస్తుతం నగర విస్తరణతో నివాస, వాణిజ్య ప్రాంతాల మధ్యలోకి వచ్చాయి. వీటిలో కాలుష్యకారక, ప్రమాదకర పరిశ్రమలను నగర పరిధి వెలుపలికి తరలించడం, నగరంలోని పారిశ్రామిక భూములను కొత్త అవసరాలకు వినియోగించడం లక్ష్యంగా హిల్ట్‌పీ కింద ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అయితే భూముల కేటాయింపు నుంచి పరిశ్రమల స్థాపన వరకు.. ప్రతి దశను సమన్వయంతో పూర్తి చేయడం కీలకం. భారీ పెట్టుబడుల అంచనాలు వాస్తవరూపం దాల్చాలంటే భూ సమీకరణ, రోడ్లు- యుటిలిటీస్, విద్యుత్, నీరు, కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల పనులు వేగంగా పూర్తవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక పార్కుల సంఖ్య పెరగడం మాత్రమే కాకుండా.. కేటాయించిన భూముల్లో పరిశ్రమలు ఏర్పడి, పెట్టుబడులు రావడం, ఉద్యోగాలు సృష్టించడం తదుపరి దశలో కీలకంగా మారనున్నాయి.  

మరిన్ని వార్తలు