షాద్‌నగర్ లో ప్రజావాణిలో నిరసన
షాద్‌నగర్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను, హామీలను వెంటనే అమలు చేసి తీరాలని బీఆర్ఎస్ పార్టీ షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొని, స్థానిక ఎంపీడీవో శ్రీకాంత్‌కు విజ్ఞాపన పత్రాన్ని (మెమోరాండం) అందజేశారు.
పట్టణ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు దాటుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ప్రధాన డిమాండ్లను అంజయ్య యాదవ్ పేర్కొంటూ.. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, ఉచిత స్కూటీలను తక్షణమే అందించాలని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెంచిన రూ.4,000 పింఛన్‌ను అమలు చేయాలని కోరారు.
రైతు సంక్షేమంలో భాగంగా రైతులకు ‘రైతు భరోసా’, పంట బోనస్, నిరంతర ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించడంతో పాటు రైతు కూలీలకు ఏటా రూ.12,000 అందించాలని స్పష్టం చేశారు. ఉపాధి, విద్యకు సంబంధించి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించడంతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
