సాగునీటికి.. సమరశంఖం

07-09-2026 | 06:00am

ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఎందుకివ్వరు..?

లక్షలాది మందితో మరో జలయుద్ధం

  1. కాళేశ్వరంపై నిర్లక్ష్యాన్ని ఇక సహించం
  2. ఎన్డీఎస్‌ఏ రిపోర్టుతోనైనా కళ్లు తెరవాల్సిందే..
  3. మౌనం వీడుదాం.. క్షేత్రంలోకి దిగుదాం
  4. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు
  5. ఎర్రవల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సుదీర్ఘ సమావేశం 
  6. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ‘తెలంగాణ ఉద్యమం సాగింది, త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది సాగు, తాగు నీటి కోసమే.. తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుల (Jeevadhara Kaleshwaram Projects) పై కాంగ్రెస్ సర్కార్ (Congress government) చేసిందంతా దుష్ప్రచారమే.. కుట్ర పూరితంగానే నీటిని ఎత్తిపోయడం లేదనే వాస్తవం ఎన్డీఎస్‌ఏ ప్రకటనతో స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు చేపట్టాలి’ అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు విని యోగంలోకి తేవడం లేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో (Nagarjunasagar, Srisailam Project) నీళ్లు ఉన్నా తెలంగాణలోని పంటలకు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. సాగు, తాగునీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం తో మరో జల యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు.

ఇందుకు సంబంధించి పార్టీలోని ఇతర ముఖ్య నేతలతో కలిసి చర్చించి, త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణకు విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  బీఆర్‌ఎస్‌ఎల్పీ సంయుక్త సమావేశాన్ని అధినేత కేసీఆర్.. ఆదివారం ఎర్రవల్లిలో నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చించే వేదికగా కాకుండా బూతు కూతలకు వేదికగా మార్చడం పట్ల కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులను సభలో తులనాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఉభయ సభల్లో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌ల జలాలను తెలంగాణ రైతాంగానికి అందకుండా పక ్కరాష్ట్రం ఉపయోగించుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తున్నదని మండిపడ్డారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా పాలమూరు  రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయినా, 

కృష్ణా జాలాలను ఎత్తిపోసి ఉమ్మడి నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటిని ఎందుకు అందించలేక పోతున్నారని ప్రశ్నించారు. మేడిగడ్డ దగ్గర చిన్నపాటి మరమ్మతులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టులను వినియోగంలోకి తెస్తే దాదాపు 13 జిల్లాల్లో రైతులు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ వివరించారు. అయినా ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరంపై ఇకనైనా నిర్లక్ష్యం వీడకపోతే, తానే స్వయంగా లక్షలాది మందితో కార్యాచరణ ప్రకటిస్తానని  కేసీఆర్ హెచ్చరించారు. సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. అదే విధంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత కేసీఆర్ పలు సలహాలు, సూచనలు ఇస్తూ సుదీర్ఘ చర్చ జరిపారు.   

బీఆర్‌ఎస్‌ఎల్వీ సమావేశంలో  చర్చించిన ముఖ్యమైన అంశాలు

వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు, హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందిందో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనా వైఫల్యంపై బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడంపై అధినేత సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌తో పాటుముఖ్య నేతలను, జిల్లా నాయకత్వాన్ని, కార్యకర్తలను అభినందించారు.   

‘పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పిల్లల వివాహాలు, దవాఖాన ఖర్చులు వంటి అత్యవసర పరిస్థితుల్లో తమ భూములను అమ్ముకోవడానికి వీల్లేక ప్రజలు గోసపడుతున్నారు.  రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో తాగునీటి అవసరాలను తీర్చడం లేదు, మిషన్ భగీరథ ను నిర్వీర్యం చేసింది.

నిరుపేదల పిల్లలు ఉన్నత చదువులు చదువుతూ, వారి భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదు’ అని కేసీఆర్ తెలిపారు. ఈ సమస్యలపై అసెంబ్లీ వేదికగా పోరాడాలన్నారు. అదే విధంగా ‘పాలిటెక్నిక్ విద్యను భ్రష్టు పట్టించే విధంగా జీవో 97ను తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. ఎన్నికల ముందు నిరుద్యోగులను ఉసిగొల్పి, లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికిన కాంగ్రెస్  హామీలు ఎక్కడపోయాయి..

ఈ విషయంపై నిరుద్యోగ యువత ఆందోళన చెందుతుంది, కాంగ్రెస్  మోసపు హామీలను ప్రశ్నిస్తున్నారని, వారికి మద్దతుగా ఉభయ సభల్లో సభ్యులు గళమెత్తాలి’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. నిరుద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ల అమలు కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. 

ఫ్యూచర్ సిటీపేరుతో అంతులేని అవినీతి

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫార్మా ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంకల్పించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రద్దు చేసిందని కేసీఆర్ తెలిపారు.  ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం అంతులేని అవినీతికి పాల్పడుతుందని, ప్రభుత్వం పేదల భూములతో రియల్ ఎస్టేట్ దందా చేస్తుందని, అత్యంత దుర్మార్గమని ఆరోపించారు. సింగరేణి గనుల్లో అవినీతి పెచ్చు మీరిందని,  సింగరేణి కుంభకోణాలకు నెలవుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ఉభయసభల్లో పార్టీ సభ్యులు ప్రశ్నించాలని కోరారు. 

ప్రభుత్వ భూములను భవిష్యత్తు తరాల అవసరాలకు ఏమాత్రం మిగిల్చకుండా, తమ ఇష్టా రీతిన అక్రమ అమ్మకాలు చేపడుతున్న ప్రభుత్వ చర్యలను నిలదీయాలన్నారు. సజావుగా నడుస్తున్న మెట్రో రైలు నిర్వహణను అనాలోచిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకున్నదని, తద్వారా రాష్ట్ర ఖజానా పై విపరీతమైన భారాన్ని పోపడమే కాకుండా నిర్వహణ చేతగాని పరిస్థితిలోకి నెట్టివేయబడిందని, ఇటువంటి తప్పుడు నిర్ణయాలపై ప్రభుత్వ వైఖరిని  ప్రశ్నించాలని పార్టీ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.

గోదావరి, కావేరి నదుల లింకు ప్రాజెక్టు పేరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టానికి ఒడిగడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఉభయసభల్లో ప్రశ్నించాలన్నారు. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బరాజ్‌లను ఉద్దేశ పూర్వకంగా నిర్వీర్య చేస్తున్న ప్రభుత్వ కుట్ర మీద నీటి యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ అధినేత పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్ర రైతాంగం ప్రజలు సాగునీటి తాగునీటి అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను తగ్గించే కుట్ర చేస్తూ, రాష్ట్ర విద్యా విధానానికి విఘాతం కలిగిస్తున్నారని కేసీఆర్ అన్నారు.

గురుకులాల నుంచి విద్యుత్ విధానాల వరకు..

‘గురుకులాలను  ప్రపంచ స్థాయి విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దిన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ప్రపంచస్థాయిలో పోటీకి తట్టుకొని, ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకొని, సుందరమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు వీలుగా ఎస్సీ, ఎస్టీ బీసీలకు వేలాది గురుకులాలను స్థాపించి తీర్చిదిద్దాం. అటువంటి గురుకులాల్లో విద్యార్థుల మృత్యుఘోస వినిపిస్తోంది. రాష్ట్రంలో విద్యా విధానం క్షీణించింది.  శాంతిభద్రతలు అదుపు తప్పాయి.

మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. బంధుప్రీతి ఆశ్రితపక్షపాతంతో మునిగిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం... ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ వ్యవస్థలు అవినీతిమయంగా రాష్ట్ర పాలనను కొనసాగిస్తున్నాయి’ అని కేసీఆర్ ఆరోపించారు. ‘రాష్ట్ర విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న నిర్ణయాలు వినియోగదారులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. అడ్డగోలుగా వస్తున్న బిల్లులు చెల్లించలేక పేదలు, మధ్యతరగతి ఇప్పటికే బాధలు పడుతున్నారు.

విద్యుత్ సరఫరా రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారింది.. రైతు డిస్కం ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే కుట్ర దాగి ఉన్నది’ అని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, విద్యుత్ విధానాలపై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు.

ఉద్యోగులు దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించని ప్రభుత్వం 

ఉద్యోగులు దాచుకున్న సొమ్మును రిటైర్డ్‌మెంట్ తరువాత తిరిగి ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేవని కేసీఆర్ విమర్శించాఉ. కొందరు రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్స్ అందక మరణించిన వార్తల పట్ల కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వాన్ని అడిగితే రెండేళ్లు ఏమీ అడగవద్దు అనడం అన్యాయమన్నారు. ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ పెండింగ్ వంటి సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో సంక్షేమం, రాష్ట్ర ప్రగతి, ఆర్థిక పరిస్థితిపై ఎమ్మెల్సీలు,  తో కేసీఆర్ లోతుగా చర్చించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, బీఆర్‌ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, శానసభాపక్ష ఉప నేతలు తన్నీరు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మండలి ఉపనాయకులు ఎమ్మెల్సీలు ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు