బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీ

13-09-2026 | 05:30am
  1. సభ్యుల సస్పెన్షన్‌పై సెటైర్లు 
  2. అధికారపక్షాన్ని అనుకరిస్తూ నేతల పాత్రలు 
  3. సీఎంగా తలసాని, స్పీకర్‌గా మాణిక్‌రావు 
  4. ‘సబ్జెక్ట్ తప్ప ఏమైనా మాట్లాడండి’ అంటూ తలసాని పంచ్‌లు

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ భవన్(Telangana Bhavan) శనివారం కాసేపు అసెంబ్లీ(Assembly)ని తలపించింది. సీఎం కుర్చీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Former Minister Talasani Srinivas Yadav), స్పీక ర్ స్థానంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మంత్రుల పాత్రలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy), గంగుల కమలాకర్(Gangula Kamalakar) కనిపించడంతో ఆసక్తికర వాతావరణం నెలకొంది. అసెంబ్లీ సమావేశాల్లో తమ ఎమ్మెల్యేల సస్పెన్షన్, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ ‘మాక్ అసెంబ్లీ(Mock Assembly)’ నిర్వహించింది. అధికార పక్షాన్ని అనుకరి స్తూ ప్రభుత్వ విధానాలపై నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించి నవ్వులు పూయించారు.

అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. ప్రజా సమస్యలపై చర్చించేం దుకు తెలంగాణ భవన్ వేదికగా ప్రత్యామ్నాయ సభ నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ పాత్రను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి పొంగులేటి పాత్రలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ రక్తికంట్టించారు. సభ ప్రారంభంలో కేటీఆర్(KTR), హరీశ్‌రావు(Harish Rao)తో పాటు ఇతర బీఆర్‌ఎస్ సభ్యులు ప్రజా సమస్యలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. 

ఇరిగేషన్‌పై తొలి చర్చను ప్రారంభించిన జగదీశ్‌రెడ్డి..

మాక్ అసెంబ్లీలో  ఇరిగేషన్ అంశంపై తొలి చర్చను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు సాగు, తాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు నీరు అందిందని, మహబూబ్‌నగర్ మినహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సాగునీరు చేరిందని పేర్కొన్నారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించామని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించామని తెలిపారు. కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లా  సస్యశ్యామలంగా మారిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. పోతిరెడ్డిపాడు, వెలుగొండ ద్వారా నీటి తరలింపు జరుగుతోందని ఆరోపించారు. కన్నెపల్లి నుంచి వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిందని, ఇప్పటికే 150 టీఎంసీల నీరు సముద్రం పాలైందన్నారు.

25 ఏళ్లు ఉంటాం.. ఎప్పుడైనా అమలు చేస్తాం : తలసాని సెటైర్

ముఖ్యమంత్రి పాత్రలో తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మాక్ అసెంబ్లీలో నవ్వులు పూయించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామని, అయితే ఏ 100 రోజుల్లో అమలు చేస్తామో చెప్పలేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఐదేళ్లు కాదు.. 25 ఏళ్లు మేమే ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు హామీలు అమలు చేస్తాం’ అంటూ సెటైర్ వేశారు. ఢిల్లీతో తమకు అనేక ఇబ్బందులు ఉన్నాయని, పార్టీలో కూడా సమస్యలు ఉన్నాయని, చివరకు బీఆర్‌ఎస్‌తో కూడా ప్రశాంతత లేదంటూ ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.

నీళ్ల సమస్యపై జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుండగా.. ‘ఏమైనా మాట్లాడండి.. కానీ సబ్జెక్టు మాత్రం మాట్లాడొద్దు’ అంటూ అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఎదురవుతున్న పరిస్థితులను వ్యంగ్యంగా చూపించారు. ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే మైక్ ఇవ్వడం లేదంటూ స్పీకర్ పాత్రలో మాణిక్‌రావు సెటైర్ వేశారు. రైతుల సమస్యలు, యూరియా కొరతపైనా తలసాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘పాత రోజులు తెస్తామన్నాం.. తెచ్చాం. యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్‌లో పెట్టే పాలన తెచ్చాం’ అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజలు ఏ సమస్యపై ప్రశ్నించినా పట్టించుకోని పరిస్థితి ఉందంటూ వ్యాఖ్యానించారు.

ఖర్చు పెట్టాం.. సంపాదించుకోవద్దా?: పొంగులేటి పాత్రలో గంగుల 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాత్రలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు మాక్ అసెంబ్లీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సొంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకోవాలి’ అంటూ అవినీతి ఆరోపణలను వ్యంగ్యంగా ప్రస్తావించారు. పొద్దున లేస్తే కేటీఆర్, హరీశ్‌రావు నా మీదే పడుతున్నారు. నేను ఒక్కడినే కమిషన్లు తీసుకోవడం లేదు అంటూ పొంగులేటిని అనుకరిస్తూ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు అండగా ఉన్నారని, సమస్యలను చర్చలు, సెటిట్‌మెంట్ల ద్వారానే పరిష్కరిస్తామని వ్యంగ్యంగా పేర్కొన్నారు. వెలుగుమట్లలో దళితుల ఇళ్లను కూల్చివేశారని ఆరోపిస్తూ.. భూ భారతి కాదు.. భూ హారతి చేస్తాం అంటూ వ్యాఖ్యానించారు. ‘మైనింగ్ అంటే మై ఎర్నింగ్’ అంటూ మరో సెటైర్ పేల్చారు. 

ప్రిపేరై రాలేదు.. కన్ఫ్యూజ్ చేయొద్దు : ఉత్తమ్ పాత్రలో పల్లా 

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాత్రను పోషించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను పూర్తిగా సిద్ధమై రాలేదని, తనను కన్ఫ్యూజ్ చేయవద్దని వ్యాఖ్యానించి సభలో నవ్వులు పూయించారు. మిలటరీలో పనిచేసి వచ్చానని, తనకు క్రమశిక్షణ ఉందని ఉత్తమ్ తరహాలో వ్యాఖ్యలు చేశారు. మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎస్సీ, ఎస్టీ అంశాలను ప్రస్తావించారు.

చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చామని, వాటికి రైతుబంధు కూడా అందించామని చెప్పారు.  కాగా బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీ రాజకీయంగా అధికార కాంగ్రెస్‌పై విమర్శలకు వేదికగా మారింది. మాక్ అసెంబ్లీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  

మరిన్ని వార్తలు