హైదరాబాద్లో భారీ వర్షం.. ఆరు జిల్లాలకు అలర్ట్
హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచే భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. తెల్లవారుజామున హైదరాబాద్‌లోని(Hyderabad) ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం చిరుజల్లులు పడుతున్నాయి. రాబోయే గంటలో నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు, నిరంతర వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు తమ వాహనాలను నెమ్మదిగా నడపాలని, ఇతర వాహనాలకు సురక్షిత దూరం పాటించాలని, నీటితో నిండిన రోడ్లు, అండర్‌పాస్‌లు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు(Traffic police) సూచించారు. నీటిమట్టం స్పష్టంగా లేనప్పుడు వరద నీటితో నిండిన రోడ్లను దాటేందుకు ప్రయత్నించవద్దని కూడా ప్రయాణికులకు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలి, అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి, భారీ వర్షంలో హెడ్‌లైట్లను ఆన్ చేసి ఉంచాలి, అలాగే అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, లేన్ మార్చడం వంటివి చేయకూడదని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణలోని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ విధించింది. మెదక్, సంగారెడ్డి,వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములుతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటలకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు.