పిల్లల వేడుకోళ్లు.. అయినా మారని తల్లి నిర్ణయం!
నిర్మల్‌లో విషాద ఘటన.. కుటుంబ కలహాలతో మహిళకు తీవ్ర గాయాలు!
నిర్మల్: కుటుంబ సమస్యలు ఓ మహిళను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా ఆమె శాంతించలేదు. చివరకు నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి దూకి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన సంగీత (30)కు ఎనిమిదేళ్ల క్రితం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రవితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాలను సంగీత తన తల్లికి చెప్పడంతో ఆమె కరీంనగర్ నుంచి నిర్మల్‌కు వచ్చింది. సమస్య పరిష్కారం కోసం ఇద్దరూ కలిసి సఖి కేంద్రాన్ని ఆశ్రయించారు. అక్కడ Counselling తీసుకున్న అనంతరం బయటకు వచ్చిన సమయంలో మరోసారి గొడవ జరగడంతో సంగీత తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలిసింది.
ఆ తర్వాత శివాజీ చౌక్‌లోని ఓ Shopping Mall పక్కన నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనంపైకి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, Fire Department సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను పరిష్కరించేలా చూస్తామని భరోసా ఇచ్చినా ఆమె కిందికి దిగేందుకు అంగీకరించలేదు. చివరకు అక్కడికి చేరుకున్న కొందరు ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సంగీతకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలతో పాటు తలకు గాయమైంది. వెంటనే ఆమెను నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్‌లోని RIMSకు పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సమ్మయ్య తెలిపారు.