స్వాములారా.. పంబా నదిలో ఆ పని చేయొద్దు!
పంబా నదిలో దుస్తులు వదిలేస్తున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!
శబరిమల: అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల యాత్రకు వెళ్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భక్తులకు(Andhra Telangana Ayyappa Devotees) కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) కీలక విజ్ఞప్తి చేశాయి. పంబా నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత ధరించిన దుస్తులను నదిలోనే వదిలేయవద్దని సూచించాయి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు అవగాహన కల్పించాలని కోరుతూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు అధికారికంగా లేఖలు పంపాయి. ప్రస్తుతం వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో పంబా నది వద్ద భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ సమయంలో చాలామంది స్నానం అనంతరం తమ సంప్రదాయ దుస్తులను నదిలోనే వదిలేస్తున్నారు. దీంతో పంబా నది తీవ్రంగా కలుషితమవుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల ట్రక్కుల కొద్దీ దుస్తులు పేరుకుపోతుండటంతో వాటిని తొలగించడం పారిశుద్ధ్య సిబ్బందికి పెద్ద సవాలుగా మారిందని తెలిపారు.
దుస్తులను నదిలో(Pamba River Pollution) వదిలేయాలనే నిబంధన ఏ శాస్త్రంలోనూ, అయ్యప్ప పూజా విధానంలోనూ లేదని TDB స్పష్టం చేసింది. కొందరు గురుస్వాముల సూచనలతో భక్తులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలా చేయడం వల్ల నదీ జలాల నాణ్యత దెబ్బతినడంతో పాటు ఆరోగ్య, పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ ఏడాది శబరిమల యాత్రను ‘Clean Sabarimala – పవిత్ర శబరిమల’ నినాదంతో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పంబా నది(Pamba River) పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడటం ప్రతి అయ్యప్ప భక్తుడి బాధ్యతని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రచార మాధ్యమాల ద్వారా ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. భక్తులు కూడా నదిలో దుస్తులు వదలకుండా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.