ఘోర ప్రమాదం.. తీరని విషాదం
తిలక్ వేడుక నుంచి తిరిగొస్తుండగా విషాదం.. ఆరుగురు దుర్మరణం!
అరారియా, నవంబర్ 19: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Bihar Accident) తీవ్ర విషాదాన్ని నింపింది. తిలక్ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న SUV అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. మృతులంతా 15 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్నవారేనని అధికారులు తెలిపారు. అరారియా జిల్లాలోని తారాబరి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సుపౌల్ జిల్లా పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమాహా గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు, అరారియాలోని సిక్టి ప్రాంతం భప్తియాహి గ్రామంలో జరిగిన తిలక్ వేడుకకు హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని SUVలో తిరుగు ప్రయాణమైన సమయంలో బీడీ బ్రిడ్జిపై ప్రమాదం చోటుచేసుకుంది.
బ్రిడ్జిపై ఉన్న ప్రమాదకరమైన మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో SUV నేరుగా మరియా నదిలో పడిపోయింది. వాహనంలో ఉన్న ఆరుగురు, డ్రైవర్‌తో సహా, నీటిలో మునిగి మృతి చెందారు. మరో యువకుడిని స్థానికులు సాహసించి రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను అరారియా సదర్ ఆసుపత్రికి తరలించారు. Postmortem పరీక్షల కోసం ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటనే దానిపై Police Investigation కొనసాగుతోంది. ఈ ఘటనతో తుమాహా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.