ప్రారంభంలోనే బంద్.. తాళాలకే పరిమితమైన కిష్టారం ఆర్వో ప్లాంట్

19-11-2026 | 11:15am

సత్తుపల్లి, నవంబర్ 19 (విజయక్రాంతి): ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ (RO Plant) ప్రారంభించిన కొద్ది రోజులకే మూతపడింది. ప్రస్తుతం ప్లాంట్ తాళాలకే పరిమితం కావడంతో స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు, సింగరేణి సంస్థ (Singareni Collieries Company) అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నమ్మి భూములు ఇచ్చినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. పైకి హామీలు ఇస్తూ ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు.

సింగరేణి సంస్థ 2004లో ప్రారంభమైనప్పటి నుంచి కిష్టారం గ్రామ ప్రజలకు అన్యాయం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సైలో బంకర్ (Silo Bunker) నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా గ్రామంలో పలువురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, కొందరు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే సామాన్య ప్రజల సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అంబేద్కర్ నగర్ ఆర్వో ప్లాంట్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్లాంట్‌ను చిత్తశుద్ధితో నిర్వహిస్తే గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు