కేసీఆర్ అటెండర్ మృతి.. గులాబీ బాస్ దిగ్భ్రాంతి

24-11-2026 | 11:47am

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేసిన కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనపై కేసీఆర్ (KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వెంకయ్యకుంట వద్ద బైక్‌పై వెళ్తున్న యువకులను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంలో కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు భరత్‌ను ఆసుపత్రికి తరలించగా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

మణికుమార్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న కేసీఆర్ వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇద్దరు యువకుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు