పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనకు మద్దతు
భద్రాచలం (విజయక్రాంతి): వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు కోరారు. భద్రాచలం నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశం పార్టీ నాయకుడు బండి రాంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర కన్వీనర్, మాజీ హెల్త్ డైరెక్టర్, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం నియోజకవర్గంలోని జనసైనికులు, కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పట్టభద్రుల ఓటరు నమోదు (Voter Registration) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని పట్టభద్రులకు తెలంగాణ ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందన్నారు. నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదు (Graduate Voters) కార్యక్రమంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ అమూల్యమైన ఓటును నమోదు చేసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అనేక ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ నియామక ప్రకటనలు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. పట్టభద్రులంతా జనసేన అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు.
ఈ సమావేశంలో జనసేన నాయకులు రాము యాదవ్, బండారు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు మారాసు గంగాధర్, కొమ్ము వెంకట్, పినపాక నియోజకవర్గ నాయకులు అంకబాబు కొసనా, నాచుపల్లి వెంకట్, నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం ప్రతినిధి పొంది వంశీ, డేగల శివ, సాయి, నక్క సురేశ్, రాము, వీర మహిళా విభాగం నాయకురాలు కుసుమ, ప్రశాంత్, రాపోల్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.