చలికాలంలో ఇడ్లీ దోశ పిండి పులియడానికి చిట్కా
చలికాలం వచ్చిందంటే చాలామంది ఇళ్లలో ఎదురయ్యే సాధారణ సమస్య ఇడ్లీ, దోశ పిండి సరిగ్గా పులియకపోవడం. సాధారణ రోజుల్లో కొన్ని గంటల్లోనే పులిసే పిండి.. చలికాలంలో మాత్రం ఎంతసేపు ఉంచినా ఉబ్బదు. దీంతో ఇడ్లీలు గట్టిగా రావడం, దోశలు సరిగా రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలు (Tips) పాటిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
సాధారణంగా ఇడ్లీ, దోశ పిండి తయారీకి బియ్యం, మినపప్పును 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టి రుబ్బుకుంటారు. అనంతరం పిండిని 5 నుంచి 6 గంటల పాటు పులియబెడితే వాడుకోవడానికి సిద్ధమవుతుంది. అయితే చలికాలంలో ఉష్ణోగ్రతలు (Temperature) తగ్గడం వల్ల పులిసే ప్రక్రియ నెమ్మదిస్తుంది.
ఇలాంటి సమయంలో రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిపై కాటన్ వస్త్రాన్ని (Cotton Cloth) కప్పి, గిన్నె మూతికి గట్టిగా కట్టాలి. ఆ తర్వాత మరో ప్లేట్‌తో మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల పిండి చుట్టూ వెచ్చదనం స్థిరంగా ఉండి పులిసే ప్రక్రియకు సహాయపడుతుంది.
పిండి త్వరగా పులవాలంటే గిన్నెను ఇంట్లో వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచడం మంచిది. వంట పూర్తయిన తర్వాత పొయ్యి పక్కన ఉండే వెచ్చని ప్రదేశంలో పెట్టుకోవచ్చు. అయితే నేరుగా వేడిగా ఉన్న పొయ్యిపై ఉంచకూడదు. ఇంట్లో ఓవెన్ ఉంటే దాని లైట్ ఆన్ చేసి పిండిని లోపల పెట్టవచ్చు. లేదంటే ఓవెన్‌ను కొద్దిసేపు వేడి చేసి పూర్తిగా ఆఫ్ చేసిన తర్వాత పిండిని అందులో ఉంచవచ్చు. అధిక వేడి తగలకుండా జాగ్రత్త పడాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
పిండిని మరీ చల్లని ప్రదేశంలో ఉంచకూడదు.
పిండికి తగినంత పులిసే సమయం ఇవ్వాలి.
ఓవెన్లో అధిక ఉష్ణోగ్రత ఉండకుండా చూసుకోవాలి
పిండి పులిసిన తర్వాత వెంటనే వాడుకోవచ్చు లేదా ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.
ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలోనూ మెత్తటి ఇడ్లీలు, రుచికరమైన దోశలు తయారు చేసుకోవచ్చు. పిండి పులవడం లేదని ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!