జిమ్ సప్లిమెంట్ల పేరుతో మోసం.. ఎఫ్డీఏ హెచ్చరిక
ముంబై: జిమ్(Gym)లలో విక్రయించే హెల్త్ సప్లిమెంట్ల(Health Supplements)పై మహారాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచింది. అనుమతులు లేకుండా ప్రోటీన్ పౌడర్లు, ఇతర న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముండే(FDA Commissioner Tukaram Munde) హెచ్చరించారు. ఉత్పత్తుల లేబుళ్లపై తప్పుడు ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
జిమ్ నిర్వాహకులదీ బాధ్యతే!
సప్లిమెంట్ల విక్రయాల్లో తయారీదారులదే పూర్తి బాధ్యత కాదని ముండే పేర్కొన్నారు. హోల్సేల్ వ్యాపారులు, రిటైలర్లు, జిమ్ నిర్వాహకులు కూడా తాము విక్రయించే ఉత్పత్తులకు అవసరమైన FSSAI లైసెన్స్ ఉందో లేదో పరిశీలించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్పత్తులను విక్రయిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తప్పుడు హామీలకు చెక్
ప్రోటీన్ పౌడర్లు, హెల్త్ సప్లిమెంట్ల ద్వారా కండరాలు పెరుగుతాయని, ప్రత్యేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆధారాలు లేని ప్రచారం చేయడంపై FDA అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్పత్తుల్లో పేర్కొన్న పదార్థాలు నిజంగా ఉన్నాయా? వాటి ఆరోగ్య ప్రయోజనాలకు శాస్త్రీయ ఆధారాలున్నాయా? అనే అంశాలను పరిశీలించాలని ముండే సూచించారు.
సప్లిమెంట్ల కొనుగోలులో యువత అప్రమత్తంగా ఉండాలని, కేవలం జిమ్ ట్రైనర్ల సూచనల(Gym trainers instructions) ఆధారంగా వాటిని వినియోగించవద్దని ఆయన తెలిపారు. సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మహారాష్ట్రలో సప్లిమెంట్ల తయారీ నుంచి విక్రయాల వరకు అన్ని దశల్లో తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు FDA వెల్లడించింది.